ఆ మూడు రాష్ట్రాలలో అలా, కానీ కర్ణాటకలో ఇలా….బిజెపి వింత న్యాయం!

Thursday, May 17th, 2018, 04:43:38 PM IST

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు ఎన్నడు లేనంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. మొన్న వెలువడిన ఫలితాలలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ తొలుత ప్రభుత్వ ఏర్పాటు చేయలేదని అందరూ భావించారు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ కు అక్కడ 78 స్థానాలు రావడంతో హంగ్ ఏర్పడడం ఖాయమని తెలుసుకున్న యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ తాము జేడీఎస్ తో కలిసి జట్టు కట్టడానికి సిద్ధమని ప్రకటన విడుదల చేశారు. ఐతే ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వము ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకున్నారు. వెనువెంటనే జేడీఎస్ అధినేత కుమార స్వామి తాము లౌకిక వాదమున్న కాంగ్రెస్ తో కలవడానికి సిద్దమని, ఆ రోజు సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కలవడానికి ఇరు పార్టీల ఎమ్యెల్యేలతో కలిసి తరలి వెళ్లారు. మరోవైపు బిజెపి నేత యెడ్యూరప్ప కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని గవర్నర్ ని నివేదించారు.

అయితే గోవేర్నర్ ఎవరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారా అని ఎదురుచూడగా, అత్యధిక సీట్లు పొందిన బీజేపీకే ఆయన అవకాశమిచ్చి నేడు యెడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిచారు. బలనిరూపణకు వారికీ 15రోజుల సమయం కేటాయించారు. కాగా బీజేపీ తీరుపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఇటీవల గోవా, మేఘాలయ, మణిపూర్ లలో బిజెపికి అతి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ వారు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రస్తుతం అక్కడ రూలింగ్ లో వున్నారు. గత సంవత్సరం మణిపూర్ ఎన్నికల్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 28 దక్కించుకోగా, బిజెపి 21 గెలిచింది. అధిక స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ను తోసిపుచ్చి గవర్నర్ నజ్మా హెప్తుల్లా బిజెపికి ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. అదే సమయంలో జరిగిన గోవా ఎలెక్షన్లలో హంగ్ ఏర్పాటై మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్ 17 గెలుచుకోగా, బీజేపీకి 13 దక్కాయి. కాగా గవర్నర్ మృదుల సిన్హా బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికారు, తదనంతరం మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఇకపోతే మొన్న ఫిబ్రవరి లో జరిగిన మేఘాలయ ఎన్నికల్లో మొత్తం 59 స్థానాల్లో కాంగ్రెస్ 21 స్థానాలు, అక్కడి రీజినల్ పార్టీ అయినా నేషనల్ పీపుల్స్ పార్టీ 19 స్థానాలు పొందగా, బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. అత్యధిక సీట్లు పొందిన కాంగ్రెస్ గవర్నర్ వద్దకువెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరగా ఆయన బిజెపి మరియు రీజినల్ పార్టీ ల సహా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. మరి ఈ మూడు రాష్ట్రాల్లో చూసుకుంటే అన్నివిధాలా కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అర్హమైనదని, మరి గవర్నర్ ఎందుకు ఎక్కువ సీట్లు వచ్చిన బిజెపి కి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికారని కాంగ్రెస్ నాయకులు, పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది బిజెపి నేతల కుట్ర అని, కేంద్రంలో వున్న నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలపై రాక్షస పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు, నాయకులు మండిపడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments