తెలంగాణ ఫిలింసిటీ.. అలా అట‌కెక్కింది!

Saturday, June 9th, 2018, 03:40:59 PM IST

తెలంగాణ రాష్ట్రం కోసం బోలెడ‌న్ని ఉద్య‌మాలు చేశారు కేసీఆర్‌. ఆ క్ర‌మంలోనే ఫిలింఇండ‌స్ట్రీపైనా ఉక్కుపాదం మోపారు. ఆంధ్రోళ్ల‌ను, ఆంధ్రా సినిమావోళ్ల‌ను బెంబేలెత్తించారు. ఆ క్ర‌మంలోనే సినిమా ప‌రిశ్ర‌మ కోసం ప్రారంభంలో కేటాయించిన భూముల్లో సినిమా యాక్టివిటీస్ చేయ‌లేదంటూ ప‌లు స్టూడియోల‌కు నోటీసులు పంపించారు. అంతేకాదు.. ప్ర‌పంచంలోనే త‌ల‌మానికంగా ఉన్న వేల ఎక‌రాల రామోజీ ఫిలింసిటీని 1000 నాగ‌ళ్ల‌తో దున్నేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌. క‌ట్ చేస్తే … తెలంగాణ ఉద్య‌మం స‌ఫ‌ల‌మైంది. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ క్ర‌మంలోనే ఇక ఫిలింఇండ‌స్ట్రీ ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని అంతా భావించారు. సినీప‌రిశ్ర‌మ‌ను బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు సాగిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలో ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్ని చ‌ల్ల‌బ‌ర్చే ప్ర‌క‌ట‌న‌లు తామ‌ర‌తంప‌ర‌గా కేసీఆర్ ప్ర‌భుత్వం గుప్పించింది. తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఆంధ్రోళ్లు భ‌య‌ప‌డొద్ద‌ని ప్ర‌క‌టించేశారు.

ఇక రామోజీ ఫిలింసిటీకి పోటీగా.. దానికి కూత‌వేటు దూరంలో ఔట‌ర్ రింగ్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న న‌ల్గొండ జిల్లా రాచ‌కొండ హిల్ ఏరియాలో 2000 ఎక‌రాల్లో భారీగా తెలంగాణ ఫిలింఇండ‌స్ట్రీని ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. తెలంగాణ సినిమాకి పెద్ద ఊతం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అస‌లు ఏమైందో ఇంత‌వ‌ర‌కూ దానికి అతీ గతీ లేదు. అప్ప‌ట్లో ప‌రిశ్ర‌మ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం భూముల్ని వెతికింది. అధికారుల‌తో స‌ర్వేలు చేయించిన మాట వాస్త‌వం. కానీ ఏమైందో మ‌ధ్య‌లోనే ఆ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని సైతం ప‌లుమార్లు నాలుక్క‌రుచుకున్నారే కానీ స‌మాధానం లేనేలేదు. మొత్తానికి రాచ‌కొండ ఫిలింఇండ‌స్ట్రీ అలా అట‌కెక్కింది! అంటూ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌టే ముచ్చ‌ట్లాడుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments