నిన్న విడుదల చేసిన మహాకూటమి అభ్యర్థుల ప్రకటనలో జాప్యంపై తెరాస వ్యంగ్యంగా స్పందించింది. ఈ ఎన్నికల్లో పొరపాటున మహాకూటమి చేతిలో తెలంగాణను పెడితే తెలంగాణ ప్రజలు తమ చేతితో తమ కళ్లను తామే పొడుచుకున్నట్లు అవుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దివ్యాంగుల పెన్షనర్ల కృతజ్ఞత సభలో కేటీఆర్ మాట్లాడుతూ, మహాకూటమి భయంతో ముందునుంచే కిందా మీదా పడుతోంది. నిన్న కష్టపడి అర్ధరాత్రి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. పొద్దున్న జాబితా విడుదల చేస్తే ఎవరు తలుపులు పగలగొడతారో, ఎవరు గాంధీభవన్‌ను పగలగొడతారో అనే భయంతో అర్ధరాత్రి 11 గంటల తర్వాత జాబితా విడుదల చేశారు. అప్పట్నుంచి కాంగ్రెస్‌లో లొల్లి షురూ అయింది. ఇటీవల నేనో ఫొటో చూశాను. గాంధీభవన్‌లో ధర్నాలు జరుగుతుంటే అక్కడ సెలైన్లు పెట్టుకున్నారు. నాకో సందేహం వచ్చింది..
అది గాంధీ భవనమా లేక గాంధీ ఆసుపత్రా అని. అలాంటోళ్లు రేపు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏం చేస్తారో ప్రజలే ఆలోచించాలి. సీఎం చంద్రబాబుకు ఏపీ బాగుపడాలని ఉంటుంది. తెలంగాణ బాగుపడాలనే ప్రేమ ఆయనకెందుకు ఉంటుంది? ఆయనకు అలాంటి ప్రేమే ఉంటే చంద్రబాబు తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి 30 -40 ఉత్తరాలు రాస్తారా? ఇక్కడి ప్రాజెక్టులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తారా? ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో దాన్ని తరిమికొడదామంటే అడ్డుపడుతున్న చంద్రబాబుకు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేసినట్టు కాదా?. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మేం జీవో ఇచ్చాం. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లలో కూడా 5శాతం దివ్యాంగులకే కేటాయించాం. కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈసారి కూడా మళ్ళీ తామే అధికారం లోకి వస్తామని హర్షం వ్యక్తం చేసారు.