కోదండ‌రామ్ `జ‌న‌గామ‌`లోనే ఎందుకు?

Friday, November 9th, 2018, 12:01:07 PM IST

మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేలింది. అయితే ఇందులో తెజ‌స ప‌ట్టుప‌ట్టిన కొన్ని స్థానాల్ని మాత్రం ఇవ్వ‌డానికి కాంగ్రెస్ నిరాక‌రించింది. కోదండ‌రామ్ కోసం మాత్రం జ‌న‌గామ సీటును కేటాయించ‌డం ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డి నుంచి కాంగ్రెస్ మాజీ పీసీసీ ఛీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య పోటీకి దిగాల‌నుకున్నాడు.ఆయ‌న‌కు కూట‌మి పొత్తుల కార‌ణంగా సీటు కోల్పోక త‌ప్ప‌లేదు. జ‌న‌గామ‌ను త‌న‌కే కేటాయిస్తార‌ని ఆశ‌గా ఎదురుచూసిన పొన్నాల‌కు చివ‌రికి ఆశాభంగ‌మే అయింది. అయితే తొలుత ఈ స్థానాన్ని కేటాయించ‌డానికి ఏఐసీసీలో గురువారం పెద్ద చ‌ర్చే జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. చివ‌రికి కోదండ‌రామ్ కోరుకున్న స్థానాన్ని కేటాయించారు.

కోదండ‌రామ్ ఈ స్థానాన్నే ప్ర‌త్యేకంగా కోరుకోవ‌డానికి గ‌ల కార‌ణం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఇక్క‌డి నుంచి అధికార తెరాస అభ్య‌ర్థి ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి పోటీప‌డుతున్నాడు. గ‌డిచిన నాలుగేళ్లుగా అత‌నిపై చాలా విమ‌ర్శ‌లే వినిపించాయి. ఆ మ‌ధ్య ఓ క‌లెక్ట‌ర్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ పెద్ద దుమార‌మే చెల‌రేగింది. గులాబీ బాస్ క‌ల‌గ‌జేసుకోవ‌డంతో అది నీటి బుడ‌గ‌లా పేలిపోయింది. దీన్ని ఆస‌రాగా చేసుకుని ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిని మ‌ట్టిక‌రిపించాల‌ని, తెరాస ఓట‌మిని ఇక్క‌డి నుంచి మొద‌లుపెట్టాల‌ని కోదంగారామ్ కోరుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి వ్య‌వ‌హార శైలికి తోడు ఇక్క‌డ‌ ప్ర‌జ‌ల్లో తెరాస ప‌ట్ల గ‌ణ‌నీయంగా వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. అప్ప‌ట్లో జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలో జ‌న‌గామ‌ను జిల్లా చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు గ‌ట్టిగానే ఆందోళ‌న‌లు చేశారు. అయితే వాటిని గులాబీ బాస్ ఏమాత్రం ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో తెరాస శ్రేణుల‌పై జ‌న‌గామ ఓట‌రు గుర్రుగా వున్నారు. అది ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం వుంది. ఇది వ‌ర్క‌వుట్ అయితే కోదండ‌రామ్ జ‌న‌గామ‌లో గెలుపు అనేది న‌ల్లేరుమీద న‌డ‌కే అవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments