వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది!

Thursday, May 10th, 2018, 05:53:00 AM IST

మనం ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే రకరకాల పుస్తకాలు టెస్ట్ పేపర్లు తెప్పించుకొని ప్రిపేర్ అవుతుంటాం. కానీ ఒక యువకుడు వైఫై సాయంతో మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని మన్నార్ ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ పదోతరగతి పాస్ అయ్యాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో చదువు మానేసి ఎర్నాకులం రైల్వేస్టేషన్లో దినసరి కూలీగా చేరాడు. ఒకవైపు కూలీగా పని చేస్తూ, మరోవైపు పోటీపరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని భావించాడు.

అయితే అందుకు అతను ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్ష రాశాడు. కానీ అదృష్టం అతన్ని వరించలేదు. ఒకానొక సమయంలో అనుకోకుండా అదే రైల్వేస్టేషన్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పించడం, అందులోనూ ప్రయాణికులందరు ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం గమనించిన శ్రీనాథ్, తాను కూడా ఆ విధంగా వైఫై ద్వారా పాఠాలు వినాలి అనుకున్నాడు. వెంటనే తన బంధువులు ఒకరి వద్ద కొంత డబ్బు అప్పుచేసి చిన్న స్మార్ట్ఫోన్ కొనుక్కున్నాడు. ఇక రోజూ దాని ద్వారానే వైఫై కనెక్ట్ చేసి పాఠాలను ఆడియో ద్వారా వినేవాడు.

అంతే కాక కొందరు టీచర్ల వద్దనుండి వీడియో, ఆడియో ద్వారా కొన్ని పాటలు విని చివరకు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్లై చేసి పరీక్ష రాశాడు. చివరకు తెచ్చిన ఫలితాల్లో అతడు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యాడు. ఒకవేళ అతను ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే, కష్టాలు గట్టెక్కినట్టే. దీన్ని బట్టి చూస్తే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎంతటి కష్టాన్నైనా అవలీలగా జయించవచ్చు అని చెప్పడానికి శ్రీనాథ్ జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు……

Comments