లక్ష్మీని బాబు యాక్సెప్ట్ చేస్తారా ?

Sunday, October 7th, 2018, 12:56:55 PM IST

మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. 13 జిల్లాల గ్రామాల్లో పర్యటన నిర్వహించిన ఆయన పీపుల్ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. వాటి ప్రకారమే తన రాజకీయ కార్యాచరణ ఉంటుందని ఖచ్చితంగా చెప్పిన ఆయన కేవలం ఎన్జీవో స్థాయిలో పనిచేస్తే తాను రూపొందించిన మేనిఫెస్టోని అమలుచేయడం సాధ్యం కాదని అందుకోసం రాజకీయాల్లోకి రావాలని అన్నారాయన. దీంతో చాలా మంది లక్ష్మీ నారయణ టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలుపెట్టారు.

ఒకవేళ నిజంగానే లక్ష్మీ నారాయణ తన ఆలోచనల్ని అమలుచేయాలంటే ఒక ప్రభుత్వం ఉండాలని, అందుకోసం టీడీపీలో చేరే ఆలోచన చేసినా ఆయన్ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది సందేహమే. ఎందుకంటే ఏమాంత్రం డబ్బు ప్రస్తావన లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను, అవినీతి రూపుమాపుతాను, అవసరం అయితే దాని మీదొక ఉద్యమాన్ని లేవదీస్తాను, రుణమాఫీ, ధరల స్థిరీకరణ, దేశం మళ్ళీ గ్రామాల్లోనే నివసించాలి, యువతకు ఉపాధి వంటి ఆదర్శవంతమైన ఆలోచనలతో ఉన్న లక్ష్మీ నారాయణకు, చంద్రబాబు రాజకీయాలకు ఏమాత్రం సరితూగదు.

ఒకవేళ బాబు ఈ మాజీ ఐపీఎస్ ను తెచ్చి పార్టీలో పెట్టుకుంటే తనపై, తన సొంత వాళ్ళ పై స్వయంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను వేసుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. మెల్లగా పార్టీలోని అవినీతిపరులు, స్వార్థ రాజకీయ నాయకుల భాగోతాలన్నీ బట్టబయలవుతాయి. అప్పుడు పార్టీ ప్రయోజనాలేమో కానీ మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. కాబట్టి పక్కలో బల్లాన్ని పెట్టుకునే సాహసం బాబు చేయరనే అనుకోవచ్చు.