కుమారస్వామి ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ వెళ్తారా ?

Monday, May 21st, 2018, 03:07:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పధకాలు, కార్యక్రమాల రూపకల్పనలతో ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అక్కడి తెలుగు ప్రజలు ఎవరూ బిజెపి కి ఓటు వేయొద్దని, అక్కడి స్థానిక ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు ఓటేయండని ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్ తో కలిసి రేపు జేడీఎస్ అధినేత కుమారస్వామి ఇంక రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అహ్వాహించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆ కార్యక్రమానికి హాజరవుతుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరవుతారా లేదా అనే దాని పై సందిగ్ధత నెలకొని వుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, కేసీఆర్ సెంట్రల్ లో కాంగ్రెస్, బిజెపి కి ప్రత్యామ్న్యాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తూ, తదనుగుణంగా పలువురు ప్రాంతీయ నేతలతో చర్చలు జరుపుతున్న సమయంలో జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతవరకు వెళ్తారు అనేది చెప్పలేని పరిస్థితి.

అయితే అటు చంద్రబాబుతోను, ఇటు కేసీఆర్ తోను కుమారస్వామి విడివిడిగా ఫోన్ లో సంభాషించినట్లు సమాచారం. కాగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అందునా దేవెగౌడ తో వున్న మిత్రత్వం కోసం ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని కొందరు టిఆర్ఎస్ శ్రేణులు చెపుతున్నారు. అయితే ఇంతకీ కేసీఆర్ పక్కాగా ఆ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది తెలియాలంటే ఇంకొంత సమయం వేచిచూడవలసిందే……

  •  
  •  
  •  
  •  

Comments