జనసేనాని విజయకేతనం ఎగురవేస్తారా?

Thursday, August 9th, 2018, 10:40:23 AM IST

మొదటి నుండి కూడా ప్రజలకు తనవంతు సేవచేయాలనే తలంపుతో ఉండే పవన్ కళ్యాణ్, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో యువజన విభాగం సభ్యునిగా కొన్నాళ్ళు పనిచేసారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసాక కొన్నాళ్ళకు పవన్ జనసేన పార్టీని నెలకొల్పారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ క్రితం జనసేన పార్టీ స్థాపించేటపుడు అయనకు పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. అయితే గత ఆరునెలలనుండి ప్రజాక్షేత్రంలోకి విరివిగా ప్రజాపోరాటయాత్రపేరుతో వెళ్తున్న అయన, తనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజలసమస్యలగురించి, రాష్ట్రంలోని రాజకీయపరిస్థితుల గురించిన అవగాహన చాలావరకు వచ్చినట్లు చెపుతున్నారు. అంతే కాదు తన పర్యటన సమయంలో ప్రజలు తనవద్దకు వచ్చి సమస్యలను విన్నవిస్తుంటే, గత ఎన్నికల సమయంలో జనసేనను పోటీలో నిలపకకుండా తప్పుచేసినట్లు ఇటీవల అయన చెప్పారు.

అసలే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విడగొట్టబడి, పూర్తిగా నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు గారు వంటి అనుభవజ్ఞులైన నేత అవసరం ఎంతైనా వుంటుందనే ఆయనకు మద్దతించానని పవన్ చెప్పారు. కానీ టిడిపి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్రంలో ప్రజల పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారయిందని, బాబు గారు మరియు వారి పార్టీ నాయకులు అందరు కలిసి రాష్ట్రానికి ఏమి చేయకపోగా, అవినీతి అక్రమాలతో పాలనను కొససాగిస్తున్నారని ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన నాలుగవ ఆవిర్భావ సభలో పవన్ విరుచుకుపడ్డారు. ఇకపోతే ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో పోరాట యాత్రలు చేస్తున్న పవన్ కేవలం ఉత్తరాంధ్ర, మరియు అందులోని కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయన తన సామజిక వర్గానికి చెందిన గోదావరి జిల్లాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారనే వాదన కూడా కొంత వినపడుతోంది. అంతేకాక జనసేనలో ఇప్పటివరకు వచ్చి చేరుతున్నవారు ఎక్కువగా కాంగ్రెస్ మరియు టీడీపీలలో సరైన గుర్తింపు దక్కక వస్తువున్నవారేనని, మరి అటువంటి వారిని నమ్మి పవన్ వారికి టిక్కెట్లు ఏ మేరకు కేటాయిస్తారు అనే దానిపై కూడా పలువాదనలు వినిపిస్తున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో యాత్ర చేపట్టిన పవన్ తాను ఇచ్చిన మాట మేరకు అక్కడి ప్రజలు సమస్యలైన చేనేత మరియు నీటి సమస్యలపై ప్రధానితో చర్చిస్తాను అని చెప్పారని, కాగా అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదనే విమర్శలను కొందరు ఇతర పార్టీల నాయకులు లేవనెత్తుతున్నారు.

అయితే జనసేన వర్గాలు మాత్రం పవన్ త్వరలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారని, అధికారం తమకు ముఖ్యం కాదని, ప్రజల పక్షాన నిలబడి వారికీ న్యాయం జరిగేలా చూడడమే జనసేన ద్యేయమని చెపుతున్నారు. ఇంతవరకు బాగున్నప్పటికీ పార్టీలో చేరుతున్న వారిలో పవన్ అభిమానులు సైతం ఎక్కువగా వుంటున్నారని, వారికీ ప్రస్తుత రాజకీయ అంశాలపై అవగాహన లేదని, మరి అటువంటివారిని పవన్ నమ్మవుతారా అనేది కూడా ప్రశ్నార్ధమేనని తెలుస్తోంది ఇక మరోవైపు ప్రధానపార్టీలైన టీడీపీ మరియు వైసీపీలు కూడా ఎలాగైనా అధికారాన్ని చేపట్టేలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా దీన్నిబట్టి చూస్తే జనసేనాని రాబోయే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలో చేరికల పై మాత్రమే కాకుండా, అభ్యర్థులు ఎవరిని నిలబెట్టాలి, ఎటువంటి వ్యూహరచన చేసి ప్రజల్లోకి వెళితే అధికారం దక్కుతుంది అనే తదితర అంశాలపై దృష్టిపెడితే ఆయనకు అధికారం కొంతవరకు దక్కేఅవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments