తెలంగాణాలో రాహుల్ టూర్ కాంగ్రెస్ కి కలిసొస్తుందా?

Thursday, August 9th, 2018, 03:50:28 AM IST


తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో తమ పార్టీ ప్రాముఖ్యాన్నిగట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వినిపించలేకపోయారు కాంగ్రెస్ నాయకులు. నిజానికి రాష్ట్రాన్ని ఇవ్వగలిగిన మేము, ప్రజల్లోకి వెళ్లి అదే విషయాన్నీ మాత్రం చెప్పలేకపోయామని కాంగ్రెస్ నాయకులు మధనపడిన సందర్భాలు చాలానే వున్నాయి. అయితే నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఈ సారి ఎలాగైనా ఓడించి గద్దెనెక్కాలని కాంగ్రెస్ నాయకులూ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకుగాను వారు ఇప్పటినుండే అవసరమైన అన్నిరకాలుగా వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు మూడు విడతల పాదయాత్ర చేపట్టారు. ఇక రాహుల్ పర్యటన ఈ నెల 13 మరియు 14 తేదీల్లో ఖరారవడంతో,

పర్యటనలో భాగంగా అయన నాలుగవ విడత బస్సు యాత్ర రాజేంద్ర నగర్ నుండి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మొదట 13వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రానున్న రాహుల్ గాంధీ, అక్కడినుండి రాజేంద్ర నగర్ కు వెళ్తారట. అక్కడ దాదాపు 10వేల మంది డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ చర్చ, ఇక సాయంత్రం 5గంటలకు శేరిలింగంపల్లి లో సభ, ఆపై రాత్రి 8గంటలకు నాంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారట. ఇక అదే రోజు రాత్రి 10గంటలకు ముస్లింలతో సమావేశం కానున్నారు. అయితే తెల్లారి 14న హిందువులకు కేటాయించారని, దానిలో భాగంగా ఉదయాన్నే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తారని తెలుస్తోంది.

ఇక 11 గంటలకు జూబిలీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జిలతో మీటింగ్, ఇక 12 గంటలకు వాణిజ్య ప్రముఖులతో భేటీలో పాల్గొంటారట. అయితే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి పలువురు విద్యార్థి సంఘాల నాయకులను కలిసి అక్కడ సభఏర్పాటుకు అనుమతులు కోరనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రానికి రాహుల్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూపులు చూసిన ఇక్కడి కాంగ్రెస్ నేతలకు ఆయన పర్యటన ఖరారు కావడంతో అమిత ఆనందం వెల్లివిరుస్తోంది. ఆయన ఈ పర్యటన ద్వారా పార్టీ వర్గాల్లో ఖచ్చితంగా నూతనోత్తేజం వస్తుందని, ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలకు కొంత మేర అయినా కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాహుల్ టూర్ ఆ పార్టీకి ఏ మేర కలిసి వస్తుందో చూడాలి మరి….

  •  
  •  
  •  
  •  

Comments