హాట్ టాపిక్ : జయలలితకు రజినీకాంత్ కు తేడా అదే..!

Monday, January 1st, 2018, 11:50:56 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు సై అనేయడంతో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం మొత్తం ఇదే చర్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటుని తీరుస్తారా ? ఒకవేళ ముఖ్యమంత్రి అయితే జయకన్నా బాగా చేస్తారా ? ప్రస్తుతం ఉన్నా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీ లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా ? ఈ ప్రశ్నల గురించే రజిని అభిమానులు, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకే పార్టీలో రాజకీయ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీలో అంతటి చరిష్మా కలిగిన నాయకుడు మరొకరు లేరు. పైగా పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సూన్యత ఏర్పడిందని, రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తెలివైన నిర్ణయం అని అంటున్నారు.

గత యాభై ఏళ్లుగా డీఎంకే మరియు అన్నా డీఎంకే పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఈగత అసెంబ్లీ ఎన్నికలని మినహాయిస్తే ఇకాడని తరువాత మరొకరు ఐదేళ్లకొకసారి అధికారం చేపడుతూ వచ్చారు. ఆ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయ ఆ రికార్డుని బ్రేక్ చేసి వరుసగా రెండవ సారి అధికారం చేపట్టారు. కానీ ఏడాదిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. మరో వైపు డీఎంకే పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏం లేదు. కరుణానిధి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్లే కనిపిస్తున్నారు. ఆయన వయసు కూడా మీద పడింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అంతలోనే కరుణానిధి రెండవ కుమారుడు అళగిరి అలక వహించడంతో పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణుల్లో స్టాలిన్ పై నమ్మకం ఉన్నా.. కరుణానిధి స్థాయిలో రాజకీయ ఎత్తులు వేయగలరా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ వ్యతిరేకతలన్నీ రజినీకాంత్ కు అనుకూలంగా మారె అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తా.. రజినీకాంత్ చెప్పిన సినిమా డైలాగు ఇది. ఆ డైలాగుకు అనుకూలంగానే జయ మరణం తరువాత రజిని పొలిటికల్ ఎంట్రీ పై ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ నిన్న రజిని సంచలన ప్రకటన చేసేశారు. హంగులు, ఆర్భాటాలు, హడావిడి అనవసర ఆవేశం ఇవేవి తలివాలో మచ్చుకు కూడా కనిపించవు.వెండి తెరపై ఆయన మేనరిజమ్స్ ఒక ఎత్తైతే.. ఆఫ్ స్క్రీన్ ఆయన కనిపించే విధానం మరో ఎత్తు. ‘ నేను ఓ సయమంలో గుడి వద్ద ప్రశాంతంగా కూర్చుని ఉంటె ఓ మహిళ బిచ్చగాడనుకుని 10 రుపాయాలు ఇచ్చి వెళ్ళింది. నాకు అప్పుడే తెలిసిందే. మేకప్ లేకపోతే, ఈ స్టార్ డం లేకపోతే నేనేంటో అని. అందుకే ఈ ఆర్భాటాలకు దూరంగా ఉంటా’ అని రజిని తనకు ఎదురైనా సంఘటనని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేశారు. ప్రముఖ రచయిత్రి గాయత్రీ శ్రీకాంత్ రజినీకాంత్ జీవిత గాధ ని రాశారు.

1992 లో జరిగిన ఓ ఘటనని ఆమె ‘ది నేమ్ ఈజ్ రజినీకాంత్’ పుస్తకంలో రాశారు. జయలలిత పోయెస్ గార్డెన్ పక్కెనే రజిని నివాసం కూడా. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ రావలసి ఉంది. దీనితో రజిని వాహనాన్ని పోలీస్ 30 నిమిషాల పాటు రోడ్డులోని ఆపేసారు. వెంటనే వాహనం దిగిన రజిని పక్కనే ఉన్న ఓ చిన్న దుకాణంలోకి వెళ్లి సిగరెట్ అంటించారు. పోలీస్ లు భయపడుతూనే రజిని వద్దకు వెళ్లి మీరు బయలుదేరండి సర్ అని కోరారు. దీనికేం అభ్యంతరం లేదు.. ఆవిడ వెళ్లాకే నేను వెళతా అంటూ పోలీస్ లకు సమాధానం ఇచ్చారు.

జయలలితతో ఎంత దయార్ద్ర హృదయురాలో అంతే ఆవేశపరురాలు, ఆర్భాటాలని కోరుకునే వ్యక్తి అని తమిళనాడులో ప్రచారంలో ఉంది. రజినీకాంత్ ఇంతటి స్థాయిలో అభిమానులని సంపాదించడానికి కారణం ఆయన సంప్లిసిటీనే. రజినీ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయనపై కూడా ఇక విమర్శలు మొదలవుతాయి. కానీ రజినీకాంత్ అనే వ్యక్తిని విమర్శించడానికి కారణాలు మాత్రం అంత సులువుగా దొరకవు. తమిళనాడు భవిష్యత్తు రాజకీయం రజినీకాంత్, స్టాలిన్ ల మధ్య జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో వైపు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రజిని తమ పార్టీకే మద్దత్తు తెలుపుతారని బిజెపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రకటన చేసే సమయంలోనే తమిళనాడు లోని అన్ని స్థానాలకు పోటీ చేస్తానని రజిని ప్రకటించారు. అంటే రజినీకాంత్ బలమైన ముందస్తు వ్యూహంతో సిద్ధం ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత ఆరునెలలుగా జరుగుతున్న అభిమానుల సమావేశాల్లోనే రజినీకాంత్ పొలిటికల్ వ్యూహాలన్నీ సిద్ధం అయిపోయాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.