2018లో ఇలాంటి సీఎం ఉన్నాడంటే నమ్ముతారా..!

Tuesday, January 30th, 2018, 10:28:27 PM IST

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మనదేశంలో ఖచ్చితంగా కోటీశ్వరుడు అయి ఉంటాడు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ విషయాన్ని తడుముకోకుండా చెప్పేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట మన అంచనా తప్పుతుంది. గత నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి వద్ద కనీసం ఫోను కూడా లేదంటే నమ్ముతారా.. ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజం ఇది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గురించే ఇదిఅంతా. ఆయన జీవితం గురించి ఇంకా ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి.

మాణిక్ కు కనీసం ఈమెయిల్ కూడా లేదు. ఇక పేస్ బుక్, ట్విట్టర్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆయనకు కొంత ఇల్లు, వాహనం ఇలాంటివి ఏమి లేవు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి చెందిన నేత ఆయన. కమ్యూనిస్టు రాజకీయ నాయకులు కూడా లగ్జరి జీవితాన్ని అనుభవిస్తున్న ఈ రోజుల్లో మాణిక్ లా నిడారంబర జీవితాన్ని గడపడం నిజంగా ఆశ్చర్యకరం, అభినందనీయం. వచ్చే నెల 18 న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ వివరాల ప్రకారం ఆయన బ్యాంకు బ్యాలన్స్ కేవలం రెండు వేలు మాత్రమే. అయన చేతిలో ఉన్న నగదు రూ 1500.. ముఖ్యమంత్రిగా తాను పొందే జీతం మొత్తాన్ని విరాళాలకు పార్టీకోసం ఉపయోగిస్తారు. తిరిగి పార్టీ నుంచి కేవలం రూ 9 వేలు జీతం గా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగిగా రైటర్ ఐన మాణిక్ భార్యకూడా భర్త లాగే నిడారంబర జీవితాన్ని గడుపుతారు. ఆమె చేతిలో ఉన్న నగదు రూ 20 వేలు కాగా బ్యాంకు ఖాతాలో రూ 12 లక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలవడానికి క్యాంపు ఆఫీస్ కు ఆమె రిక్షాలోనే వస్తారు. 1998 నుంచి త్రిపురకు మాణిక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.