షాకింగ్ న్యూస్ : ప్రాణాలతో చలగాటం.. పులితో పోరాటం

Friday, April 6th, 2018, 09:51:11 PM IST

ఓ యువతి పులితో పోరాటం చేసింది. తన గొర్రెలను చంపిన పులిని చంపాలనుకుంది ఆ యువతి. కానీ పులితో పోరాడి తీవ్ర గాయాలపాలైంది ఆమె. ఈ ఘటన మహారాష్ట్రలోని భందర జిల్లాలోని ఉష్‌గాన్ గ్రామంలో మార్చి 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

మార్చి 24న రాత్రి.. రూపాలీ మోశ్రం తన ఇంట్లో నిద్రిస్తుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన ఇంటి బయట ఉన్న గొర్రెల మందలో నుంచి అరుపులు వినిపించాయి. యువతికి మెలకువ వచ్చింది. తక్షణమే ఆమె బయటకు వచ్చి చూడగా మూడు గొర్రెలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. అక్కడే పులి ఉంది. పులి అరుపులకు ఏ మాత్రం భయపడని రూపాలీ.. ఓ కట్టెను తీసుకొని దానిపై దాడి చేసింది. టైగర్ ఆమెను తీవ్రంగా గాయపరిచింది.

రూపాలీ అరుపులు విన్న తన తల్లి ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. పులి నుంచి తన కూతురి ప్రాణాలు కాపాడుకునే సమయంలో ఆమెపై కూడా దాడి చేసింది. మొత్తానికి తీవ్ర గాయాలపాలైన బిడ్డను తల్లి ఇంట్లోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత తమ బంధువులకు బాధితులు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డలను ఇద్దరిని నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రూపాలీ ధైర్యానికి ప్రశంసలు
అయితే రూపాలీ మోశ్రం ముఖంపై రక్తం కారుతుండగానే ఆమె సెల్ఫీలు దిగింది. ఈ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి జరిగిన ఘటనను వివరంగా రాసింది. ఫేస్‌బుక్‌లో రెండు ఫోటోలను షేర్ చేసింది. ఆమె ముఖంపై రక్తం కారుతున్న ఫోటోలను, యువతి ధరించిన పింక్ కలర్ టీషర్ట్ పూర్తిగా రక్తంతో తడిసిపోయిన ఫోటోలను షేర్ చేసింది. రూపాలీ మోశ్రం ధైర్యానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments