మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపిన యువతి!

Sunday, April 8th, 2018, 11:23:37 AM IST

నిన్న హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ భారతీయ విద్యాభవన్ ప్రాంతంలో అర్దరాత్రి పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అయితే అందులో భాగంగా ఓ యువతి మద్యం మత్తులో హంగామా సృష్టించింది. స్నేహితునితో కలిసి ఆ యువతి ప్రయాణిస్తున్న కారును ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్‌ చేస్తున్న యువతి స్నేహితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయి పట్టుపడడంతో, అతని పక్క సీట్లో ఉన్న ఆ యువతి ఒక్కసారిగా కారు నుంచి బయటకు వచ్చి, డ్రంకన్‌ డ్రైవ్‌ను చిత్రీకరిస్తున్న మీడియాపై రాళ్లతో దాడికి పాల్పడింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర పదజాలంతో దూషించింది.

ఆమె మాటలకు అక్కడున్న మీడియా వారితో సహా అందరూ నాలుకకరుచుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమెను నిలువరించలేక ప్రేక్షకపాత్ర వహించారు. ఆ యువతి సృష్టించిన హంగామా నుంచి తేరుకునేందుకు అక్కడున్న పోలీసులకు చాలా సమయం పట్టింది. అయితే ఆఖరుకు మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి యువతిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని ఏడు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 103 ద్విచక్రవాహనాలు, 46 కార్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు….