మహిళల భద్రతే మాకు ప్రాధాన్యం :మోదీ

Thursday, April 19th, 2018, 08:40:12 AM IST


కశ్మీరులో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార ఘటనపై రాజకీయాలు వద్దని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. ‘‘ఒక చిన్నారిపై అత్యాచారం జరిగినపుడు- ఇక అంతకంటే ఘోరం ఏముంటుంది? అది ఎలా జరిగింది, గత ప్రభుత్వాలతో పోలిస్తే రేప్‌లు తక్కువా, ఎక్కువా ..అన్న చర్చకు అది సమయమా? అలా మాట్లాడడం సిగ్గుచేటు.. ఇందులో రాజకీయాలకు తావులేదు. మహిళలపై దాడులు ఆందోళనకరం. బయటికి వెళ్లిన ఓ బాలిక ఆలస్యంగా ఇంటికొస్తే తల్లిదండ్రుల్లో ఎంతో ఆందోళన ఉంటుంది. అదే ఓ బాలుడు (కుమారుడు) బయటికి వెళ్లి ఆలస్యంగా వచ్చినా- ఇంతవరకూ ఎక్కడికెళ్లావురా అని మనం అడగం. ఎందుకు? దేశాన్ని భద్రంగా, స్వచ్ఛంగా ఉంచడం కన్నా వేరేదేదీ ముఖ్యం కాదు నాకు!..’’ అని ఆయన పేర్కొన్నారు.

లండన్‌లోని చరిత్రాత్మకమైన వెస్ట్‌మినిస్టర్‌ సెంట్రల్‌ హాల్లో- బుధవారం రాత్రి ఆయన భారతసంతతి ప్రజలతో జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘భారత్‌కే బాత్‌.. సబ్‌ కే సాత్‌’ అన్న ఆ కార్యక్రమంలో ఆయన అనేక అంశాలపై ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై చాలా ఆలస్యంగా, తూతూ మంత్రంగా ఆయన స్పందించినట్లు ఇంటా, బయటా ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన ఓ విదేశీగడ్డపై ఈ సమాధానం ఇవ్వడం విశేషం.

పాక్‌-ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు జరిపిన విషయాన్ని తొలుత పాకిస్థాన్‌కు తెలియజేశామని, ఆ తరువాతే భారత్‌లో బయటికి వెల్లడించామని ప్రధాని చెప్పారు. దాడులు జరిపిన మరునాడు- అంటే 2016 సెప్టెంబరు 29న- మా సైన్యాధికారులు పాక్‌ అధికారులతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించారు. వారు లైన్లోకి రాలేదు. చివరకు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకొచ్చారు. అప్పుడు వారికి చెప్పాం. ఆ తరువాతే జర్నలిస్టులకు వివరించారం. అంతవరకూ జర్నలిస్టులను వేచి ఉండాలని కోరాం. మేమేమీ దాచలేదు’’ అని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించబోమని పాక్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు.

‘‘ నా వెనుక ఉగ్రవాద కర్మాగారాన్ని పెట్టి- దేశంలోకి టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తూంటే- వారికి -వారి భాషలోనే ఎలా బదులు చెప్పాలో మోదీకి బాగా తెలుసు’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మీద తీవ్ర వాగ్బాణాలు సంధించారు మోదీ.. ‘‘నేను వారసత్వ రాజకీయాలు చేయలేదు. అసలది నాకు వర్తించదు. మా పారీక్టి కూడా వారసత్వం పడదు’’ అని రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘నేను పేదరికాన్ని అనుభవించాను. గుజరాత్‌లోని ఓ రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్న రోజుల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ చాయ్‌వాలా రోజులు నాకు జీవితంలో చాలా పాఠాలు నేర్పాయి. ఆనాడు స్టేషన్‌లో టీ అమ్ముకున్న వ్యక్తి నరేంద్ర మోదీ… ఈరోజు లండన్‌లోని రాయల్‌ పేలస్‌ లో ఉన్నవ్యక్తి 125 కోట్ల మంది భారతీయుల సేవకుడు. చాయ్‌ అమ్ముకున్నవాడు ప్రధాని కావడం భారతదేశ ప్రజాస్వామ్మ గొప్పదనం’’ అని ఆయన హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments