శబరిమల దర్శనం కోసం మహిళా దరఖాస్తులు…

Sunday, November 11th, 2018, 10:25:53 AM IST

కేరళ రాష్ట్రం లోని అతి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇటీవల మాసపూజల కోసం ఆలయాన్ని తెరవగా కొందరు మహిళలు ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అక్కడి ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఆలయ దర్శనం కోసం 500 మందికి పైగా మహిళలు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. శబరిమల ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీని ద్వారా ఇప్పటివరకు 10 నుంచి 50 ఏళ్ల వయసు గల 500 మందికి పైగా మహిళలు దర్శనానికి రిజిస్టర్‌ చేసుకున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. అయితే వారి వివరాలను ఇంకా పరిశీలించలేదని వెల్లడించారు.

‘ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో భక్తుల నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు తీసుకోవట్లేదని, అందువల్ల వారి వివరాలను ఇప్పుడే ధ్రువీకరించలేమని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే శబరిమలకు వెళ్లే బస్సులను బుక్‌ చేసుకున్న వారిలో మాత్రం 10 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలెవరూ లేరని పోలీసులు వెల్లడించారు. మండల పూజల నిమిత్తం ఈ నెల 16న శబరిమల ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయాన్ని ఇప్పటి వరకు రెండుసార్లు తెరిచారు. అక్టోబరులో మాసపూజల నిమిత్తం ఆలయాన్ని తెరవగా.. కొందరు మహిళలు దర్శనం కోసం ప్రయత్నించారు. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు చేసుకున్న దరఖాస్తులు ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తాయో చూద్దాం.