హైదరాబాద్ క్రికెట్ లవర్స్‌కు టీ-20 ఫీవర్..!

Sunday, September 15th, 2013, 02:28:44 PM IST

sunrises

ఐపీఎల్ లో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ ఛాంపియన్స్ లీగ్ లోనూ దుమ్మురేపేందుకు రెడీ అయింది.. పేరు మారడంతో పాటు అదృష్టం కూడా మారిన హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో సన్‌రైజర్స్‌గా బరిలోకి దిగి టాప్ ఫోర్ జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరో టి20 టోర్నీ చాంపియన్స్ లీగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించేందుకు సన్‌రైజర్స్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడాల్సి ఉంది.

మొహాలీలో మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో కంద్ మారూన్స్‌తో, బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఫైసలాబాద్ వోల్వ్స్‌తో రైజర్స్ తలపడుతుంది. టీమిండియా సూపర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ సన్ రైజర్స్ పగ్గాలు చేపట్టనున్నాడు…లంక ఆటగాడు కుమార సంగక్కర సీఎల్‌టి20లో తన లంక జట్టు కంద్ మారూన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో టీం మేనేజ్‌మెంట్ ధావన్‌ను ఎంపిక చేసింది.

సన్ రైజర్స్ టీం విషయానికొస్తే కెప్టెన్ శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇరగదీసి అద్భుతమైన ఫాంలో ఉన్నాడు… ఇతడికి తోడు పార్థివ్ పటేల్ , హనుమ విహారీ , కెమరూన్ వైట్ , డరెన్ స్యామీలు బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. విహారీ మినహా మిగిలిన టాపార్డర్ బ్యాట్స్ మెన్లు విధ్వంసం సృష్టించగలరు….దీంతో సన్ రైజర్స్ తమ బ్యాటింగ్ బలంగా ఉందని భావిస్తోంది.

ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్ ను ఆదుకున్నది ఆ జట్టు బౌలర్లే.. మరోసారి బౌలర్లు తమ సత్తా చాటాలని జట్టు భావిస్తోంది.. డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, రాజన్ , స్యామీ, పెరీరా, ఆశిష్ రెడ్డి లతో బౌలింగ్ లైన్ పటిష్టంగా ఉంది….స్టెయిన్ , ఇషాంత్ లు చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. లెగ్‌స్పిన్నర్లు అమిత్ మిశ్రా, కరణ్ శర్మ ఈసారి కూడా దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు.