ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన, రహస్యమైన క్లబ్ !

Thursday, February 8th, 2018, 04:00:51 PM IST

ఒకప్పటి కాలం లో ఆడవారు, మగవారు ప్రతి రోజూ సాయంత్రాల వేళ క్లబ్ ల బాట పట్టడం, అదే ఆదివారం అయితే అక్కడే పూర్తిగా గడపడం చేసేవారు. వాస్తవానికి వారందిరికి ఆటవిడుపుగా రకరకాల కార్యక్రమాల నిర్వహణ, ఆటలు పాటలు వంటి కోలాహలం అక్కడ జరుగుతుంటుంది. ఈ రకమైన తంతు ప్రస్తుతం కూడా వున్నా, ఎన్నో విధాల ఎంటర్టైన్మెంట్ అవకాశాలు వున్న ఈ కాలంలో అదివరకు మాదిరి క్లబ్ లకు వెళ్లడం ప్రజలు కొంత మేర తగ్గించారనే చెప్పాలి. అయితే విదేశాల్లో మాత్రం ఈ క్లబ్ ల కల్చర్ మనతో పోలిస్తే ఎక్కువనే చెప్పాలి. కొన్ని దేశాల్లో వారు వీటిని ఒక హోదాగా భావిస్తుంటారు. అయితే మనము ప్రస్తుతం మాట్లాడుకోబోయేది ప్రపంచంలో కెల్లా అతి ఖరీదయిన మరియు అతి రహస్యమయిన ఒక క్లబ్ గురించి. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఈ మెన్స్ క్లబ్ జర్మనీలోని మ్యూనిచ్‌లో నెలకొల్పబడివుంది .

అయితే ఇక్కడికి అత్యంత ధనవంతులు మాత్రమే రాగలరు. ఎందుకంటే ఈ క్లబ్‌లో ఎంట్రీ ఫీజు కింద ఏదాదికి రూ. 8 కోట్లు వసూలు చేస్తుంటారు. దీనికి ఒక ప్రత్యేకత కూడా వుంది, అది ఏంటంటే ఈ క్లబ్‌ను భూమి లోపలి అంతర్భాగాన నిర్మించారు. అయితే ఇది ఎక్కడ ఉన్నదనేది చాలా సీక్రెట్‌గా ఉంచారు. తాజాగా ఈ క్లబ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వీటిని పరిశీలిస్తే ఇక్కడికి ఎంతటి ధనవంతులు వస్తారో అంచనావేయవచ్చు. ఇక్కడ మెంబర్‌షిప్‌గా తీసుకునే రూ. 8 కోట్లకు ప్రతిగా వీవీఐపీ ట్రీట్‌మెంట్‌తో పాటు, ఇక్కడికి వచ్చేందుకు ప్రైవేట్ జట్ సౌకర్యం కల్పిస్తారు. ఈ క్లబ్ ఇంటీరియర్ ఒక లగ్జరీ బార్‌ను తలపిస్తుంది. భూతల స్వర్గం అన్నరీతిలో వున్న ఈ క్లబ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి..