ఏపీ లో దుష్ట పాలన – ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్..!

Tuesday, November 6th, 2018, 12:02:11 PM IST

ఆంధ్రప్రదేశ్ లో దుష్ట పాలన సాగుతోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ప్రభుత్వం పై మంది పడ్డారు, “చంద్రబాబు అండ్ కో” చేస్తున్న అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అన్నారు. తితిలి తుఫాన్ బాధితులకు పరిహారం అందించే విషయం లో టీడీపీ నాయకులు శవాల మీద చిల్లర ఏరుకునే పద్దతిలో వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తుఫాన్ దాటికి కొబ్బరి, జీడీ రైతులు పంట నాశనమై సాయం కోసం దీనంగా చూస్తుంటే, టీడీపీ నాయకులూ ఆ పరిహారం రైతులకు అండనివ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారంటూ, సెంటు భూమి కూడా లేని వారు సైతం, 150 – 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న దాఖలాలు కోకొల్లలు ఉన్నాయంటూ ఆరోపించారు. 0.30 సెంట్ల భూమి ఉన్నవారు కూడా 3ఎకరాలు ఉన్నట్టు చూపించి ఎకరాకు 60 చొప్పున 180 కొబ్బరి చెట్లు నష్టపోయినట్టు చూపించి రూ. 2.70 లక్షల పరిహారం పొందిన వారు కూడా ఉన్నారన్నారు.

ఈ విధమైన కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు బాధితులకు అందాల్సిన పరిహారాన్ని దోచేశారని మండిపడ్డారు. అంతే కాకుండా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో కూడా అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులు ఉన్న చోటుకి దూరంగా శిక్షణా కేంద్రాలు కేటాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. అభ్యర్థులకు దగ్గరగా హైదరాబాద్, విజయవాడలో సెంటర్లు కేటాయించకుండా తెలుగు మీడియం అందుబాటు లేకుండా ఎక్కడో ఢిల్లీలో శిక్షణా కేంద్రాలు కేటాయించారంటూ ట్విట్టర్ వేదికగా ఆయన మండి పడ్డారు.