అవును కాస్టింగ్ కౌచ్ నూటికి నూరుశాతం వుంది : టాలీవుడ్ హీరోయిన్

Sunday, June 10th, 2018, 06:24:35 PM IST

ఇటీవల తమిళ నటుడు కార్తీ సరసన చెలియా చిత్రంలో నటించి తెలుగుప్రేక్షకులకు సుపరిచితమైన నటి అదితిరావు హైదరి. కాగా ప్రస్తుతం ఆమె సుధీర్ బాబుకు జోడిగా నటిస్తున్న చిత్రం సమ్మోహనం. గ్రహణం, అష్ట చమ్మ, జెంటిల్ మాన్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా అదితి మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ తనది సినిమా నేపథ్యంవున్న కుటుంబం కాదని, అయినప్పటికీ నటనపై వున్న ఆసక్తితో తాను సినిమాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. తన తొలి చిత్రం శృంగారం విడుదలకు నోచుకోలేదని చెప్పారు. ఆ తరువాత మెల్లగా తనకు ఈ ఏడేళ్లలో మంచి అవకాశాలే వచ్చాయని, పద్మావతి, చెలియా చిత్రాల్లో పాత్రలు తనకు ఎంతో నచ్చాయని అదితి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇటీవల చిత్ర పరిశ్రమల్లో ఆడవారు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై అదితి స్పందిస్తూ, కాస్టింగ్ కౌచ్ అనేది నూటికి నూరు శాతం వుందని, అయితే అది కేవలం చిత్ర పరిశ్రమలోనే కాక అన్ని చోట్ల ఉందని అన్నారు.

మన ప్రవర్తన, జీవన విధానం, అవతలివారితో మాట్లాడేమాటలను బట్టి అది ఆధారపడివుంటుందని అన్నారు. అయితే అటువంటివి పట్టించుకోకుండా ప్రతిఒక్కరు తమకు అవకాశాలు దక్కిన మేరకు వినియోగించుకుని ముందుకు సాగితే ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. నిజానికి తనకు ఈ ఏడేళ్లలో అటువంటిది ఎదురుకాలేదని, బహుశా తాను మంచి నటులు, దర్శకులు, బ్యానర్ లలో పనిచేయడం వల్ల ఆ పరిస్థితి ఎదురుకాకపోయి ఉండవచ్చన్నారు. కానీ ప్రతి మహిళా ఇటువంటి దురాచారాలను ఎదుర్కోవాలని, ఆత్మస్థైర్యం, తెగింపు ఉంటేకానీ ప్రస్తుత సమాజంలో ఆడవారు బ్రతికే పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఇక ఈ చిత్రంలో తాను ఒక నటి పాత్ర పోషిస్తున్నానని,అంతే కాక తనకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నట్లు అదితి చెప్పుకొచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments