నిన్న పెళ్లిరోజు జరుపుకున్నాడు….నేడు తన ప్రాణం బలిచేసుకున్నాడు!

Tuesday, May 22nd, 2018, 03:30:17 PM IST

ఆవేశం అనర్ధాలకు మూలం అని మన పెద్దవారు ఊరికే అనలేదు. ఏదైనా విషయంలో మనకు సమస్య ఏర్పడినపుడు వెంటనే ఆవేశపడకుండా కొంచెం నెమ్మదించి ఆలోచిస్తే ఎటువంటి ఝటిలమైన సమస్యకైనా సమాధానం దొరుకుతుందని వారు చెప్పకనే చెప్పారు. నిన్న ఒక యువకుడు అనాలోచితంగా, క్షణికావేశంలో నిండు గర్భిణీ అయిన భార్యని ఒంటరిదాన్ని చేసి తనను తాను బలి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోత్ రమేష్ కు కొన్నాళ్ల క్రితం అనూషతో వివాహం అయింది. వృత్తి రీత్యా జన్నారం పాఠశాలలో విద్య వాలంటీర్ గా పనిచేస్తున్న రమేష్ కు, అతని భార్య అనూషకు మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఒకానొకరోజు వారిమధ్య వివాదం మరింత పెద్దది కావడంతో అనూష రమేష్ ను వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే తమ పెళ్లిరోజు కావడంతో మొన్న 19వ తేదీన అనూష వాళ్ళ ఇంటికి వెళ్లి రమేష్ కేక్ కొని భార్యతో కలిసి సంబరంగా పెళ్లిరోజు వేడుక జరుపుకున్నాడు. అనంతరం ఆ మర్నాడు తిరిగి భగవాన్ నాయక్ తండాకు చేరుకొని, ఒక లేఖ రాసుకున్నాడు. నా మరణానికి నా భార్య అనూష, ఆమె తల్లి విజయలే కారణమని, వారి మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక లెటర్ రాసి, తరువాత తమ మండల పరిధిలోని ఏన్కూర్ కు చేరుకొని పురుగుల మందు డబ్బాకొని, అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్ కు అవతల వున్న పామాయిల్ తోటలోకెళ్లి ఆ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రమేష్ మరణించి ఉండడం గమనించిన అక్కడి స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు రమేష్ మృతదేహాన్ని తనిఖీ చేయగా అతని జేబులో సూసైడ్ నోట్ బయటపడింది. కాగా మరణించిన రమేష్ కుటుంబ కలహాల వల్ల మరణించాడని తెలుసుకున్నారు. అయితే రమేష్ భార్య, అతని అత్త ల వేధింపుల వల్లే తమ కుమారుడు మరణించాడని రమేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రమేష్ మృతితో భగవాన్ నాయక్ తండా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments