ఢిల్లీ చిన్నారులవి ఆకలి మరణాలుగా నిర్ధారణ!

Friday, July 27th, 2018, 01:20:50 AM IST


ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా, ఎన్ని రకాల పార్టీలు, ఎందరు నాయకులు వచ్చి పోతున్నా, దేశంలో చాలా చోట్ల దిగువస్థాయి పేదరికం అనుభవిస్తూ కొందరు ఆకలి చావులకు బలిఅవుతున్నారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మరణాలు ఆ నగరవాసులను తీవ్రంగా కలిచి వేసాయి. వివరాల్లోకి వెళితే కొద్దిరోజుల క్రితం బెంగాల్ కు చెందిన ఒక భార్య, భర్త మరియు వారి ముగ్గురు 8,4,2 ఏళ్ళ వయసు గల ఆడపిల్లలు బ్రతుకు తెరువుకోసం ఢిల్లీ లోని మండవాలీ ప్రాంతానికి వచ్చారని, అయితే అకాల వర్షాల కారణంగా వారు నివాసముంటున్న గుడిసె కొట్టుకుపోవడంతో తండ్రి వారందరిని దగ్గర్లోనే ఒక చిన్న గదిలో ఉంచాడని, అనుకోకుండా అదే సమయంలో నీళ్లలో కొట్టుకుపోయిన రిక్షా కోసం బయటకు వెళ్లిన అతను ఎప్పటినుండో తిరిగి రాకపోవడంతో కొద్దిరోజులనుండి ఆకలి బాధ తాళలేక చిన్నారులు మృతి చెందారు. అయితే మరణించిన చిన్నారులను స్థానికుల సమాచారంతో ఆసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో తనకు తినడానికి ఏదైనా కావాలని అడిగి వారి తల్లి స్పృహ తప్పి పడిపోయినట్లు వారు చెపుతున్నారు.

కాగా చిన్నారుల శరీరాలను నేడు పరిశీలించిన డాక్టర్లు వారి కడుపులు దాదాపుగా ఎనిమిది రోజుల నుండి ఖాళీగా ఉన్నాయని, వారి శరీరంలో ఏమాత్రం కొవ్వులేదని అంటున్నారు. బహుశా వీరు ఆకలి బాధ తట్టుకోలేక మరణించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే వారున్న గదిని పరిశీలించగా గదిలో విరోచన మాత్రలు వున్నయని, కాగా పిల్లల తల్లి స్థితి పరిశీలిస్తే ఆమె మానసిక రోగి వలె కనపడుతోందని డాక్టర్లు అంటున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ మరియు ఆప్ నాయకులూ మండిపడుతున్నారు. ప్రజలకు గుప్పెడు మెతుకులు కూడా పెట్టలేని నీచ స్థితిలో బీజేపీ ప్రభుత్వం వుందని, తాము ఎప్పటినుండి రేషన్ సరుకులు పేదల ఇళ్లవద్దకే వచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తాం అంటుంటే కేంద్రం నుండి మాత్రం ఎటువంటి సమాధానం రావడం లేదని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి మరణానికి ప్రభుత్వ విధానాలే కారణమని, ఇకనైనా మోడీజీ ప్రజల సమస్యలు యెరిగి పాలనాకొనసాగించాలని అంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments