మీ కోసం వెయ్యికోట్లతో ప్రగతి భవన్ : మరి అంబేద్కర్, అమరవీరుల స్థూపం పరిస్థితేంటి?

Monday, September 3rd, 2018, 03:17:00 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హంగులు మరియు ఆర్భాటాలతో నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఒక విలువలేని సభగా మిగిలిపోయిందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. అయన నేడు గాంధీభవన్ లో నిన్నటి సభ విషయమై మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, సభకు వచ్చిన వారిని చూసి ఊహల్లో తెలుతూ మురిసిపోతున్నారని, అసలు సభకు వారు వేసిన అంచనా ఒకటి అయితే, అక్కడ జరిగింది మరొకటని, మొత్తంగా చూసుకుంటే, సభకు హాజరైన వారు మూడులక్షల మించరని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తన తనయుడిని ముఖ్యమంత్రిని చేయాలనే తలంపుతోనే ముందస్తు ఎన్నికల నాటకం ఆడుతున్నారని,

నిజానికి మీరు పార్టీ పెట్టిన ఏడేళ్ల తరువాత మీ కుమారుడు అమెరికా నుండి వచ్చాడని, ఆయన గురించి ఇంత గొప్పలు చెప్పుకుంటున్న మీరు, తెలంగాణా రాష్ట్ర సాధనలో అశువులు బాసిన 1200మంది అమరవీరులను ఎందుకు విస్మరిస్తున్నారని విమర్శించారు. దాదాపు 50 నెలలకు పైగా వారి వివరారాలు సేకరించడానికి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు సమయంపట్టిందని అయన ప్రశ్నించారు. మీకోసం వెయ్యికోట్లతో ప్రగతి భవన్, అందులో విలాసవంతమైన సౌకర్యాలు, బులెట్ ప్రూఫ్ బాత్రూం. అదే ప్రజల మనుషులుగా, ప్రజలకోసం బ్రతికి నింగికేగిన అంబెడ్కర్ గారి విగ్రహం, అమరవీరుల వంటివారి స్థూపం మాటేమిటని అయన మండిపడ్డారు. ఇప్పటికే సభకు అయిన ఖర్చు మొత్తం ప్రజల మీద త్వరలో పన్నుల రూపంలో మోపేలా టిఆర్ఎస్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని అయన అన్నారు.

వాస్తవానికి నిన్నటి సభలో కేసీఆర్ తాను, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటున్న పథకాలన్నీ కూడా సమైక్య రాష్ట్రం సమయంలో అమలుచేయబడ్డవేనని, మీరు అధికారంలో వున్నంతకాలం పేద ప్రజలు పశువులు, గొర్రెలు కాసుకుంటూ అలానే జీవితంలో ఏ మాత్రం ఎదుగు బొదుగూ లేకుండా జీవించవలసిందే అని, అయితే మీ కుటుంబం వారు మాత్రం రోజురోజుకు ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. ఇక కేసీఆర్ కు మరియు టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, నిన్నటి సభతోనే ప్రజలకు కేసీఆర్ ను ఎంత మేర నమ్మారో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేసారు. ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments