ఇకనుండి వాహనాలపై “పొలీస్, ప్రెస్ మీడియా” స్టిక్కర్లకు చెక్..

Thursday, March 1st, 2018, 01:24:42 PM IST

· మీ వాహనాలపై పోలిస్, ప్రెస్, మీడియా.. అని స్టిక్కర్లు వేస్కున్నార అయితే వెంటనే తీసేయండి.

· తప్పించుకుందామని ప్రయత్నిస్తే జైలు పాలే..

· కేవలం వారం రోజుల్లోనే 892 మందికి హెచ్చరికలు జారీ

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రహదారులపై వాహనాలను నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇక నుండి వాహనాలపై “పోలిస్, ప్రెస్, మీడియా” అని స్టిక్కర్లు ఉన్న వాహనాలను చుసిన వెంటనే నిలిపివేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనుమతి లేకుండా “పోలిస్, ప్రెస్, మీడియా” అని రాసిఉన్న వాహనాలను పట్టుకొని తనిఖీ చేయగా… వారికి పోలీసు శాఖకు సంబంధమే లేదని తేలడంతో వారం రోజుల నుంచి రహస్యంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పుడు కొందరు టు వీలర్ దొంగలు, కార్లలో వెళ్లేవారు ఇలాంటి స్టిక్కర్లను అతికించుకోవడం గమనించి.. వారి గుర్తింపు పత్రాలను చూపించమని ప్రశ్నించగా, దీంతో పదుల సంఖ్యలో వాహనచోదకులు పట్టుబడ్డారు. పోలీసులు ఆ స్టిక్కర్లను తొలగించి ఇలా చేయకూడదని చెబుతున్నారు. రెండోసారి చిక్కితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 892 మంది వాహన చోదకులను పట్టుకున్నారు.

స్టిక్కర్ ఉంటే చాలు… దూసుకెళ్లడమే..
పట్టణంలో, శివారు ప్రాంతాల్లో కొందరు యువకులు, నేరస్థులు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ప్రెస్‌, పోలీస్‌ స్టిక్కర్లను అతికించుకుని ఆయా విభాగాలకు చెందిన వారిగా నటిస్తున్నారు… తాము జర్నలిస్టూలమని, ఫలనా పత్రిక, ఛానెల్‌లో పనిచేస్తున్నామని చెబుతున్నారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా?…ఇదుగో గుర్తింపు కార్డు అంటూ ఉత్తుత్తి గుర్తింపు కార్డులను బయటకు తీస్తున్నారు. మరికొందరు ఆంగ్ల పత్రికల విలేకరులమంటూ సొంతంగా గుర్తింపు కార్డులను తయారు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ఠాణాల పరిధుల్లో పదుల సంఖ్యలో ఐపీఎస్‌లు, పోలీస్‌ అధికారులు, విలేకరులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు పూర్తిస్థాయిలో వీరి వాహనాలు తనిఖీలు చేయకుండా వదిలేస్తున్నారు. పాతబస్తీలో కొందరు నేరస్థులు కూడా ప్రెస్‌ స్టిక్కర్లను ఉపయోగిస్తున్నారు. పగలూ,రాత్రి తేడాలేకుండా వెళ్లేందుకు కొందరు ఉపయోగించుకుంటుండగా… మరి కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. హవాలా రాకెట్‌ కేసులో పోలీసులు పట్టుకున్న సోహన్‌లాల్‌ పత్రికా విలేకరిగా గుర్తింపు కార్డును సొంతంగా తయారు చేసుకోవడం ఇందుకు తాజా నిదర్శనం.

ఏమైనా చలానాలు బాకీ ఉంటే చెల్లించావాలిసిందే..
పోలీస్‌, ప్రెస్‌, మీడియా స్టిక్కర్లను దుర్వినియోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు రహస్యంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వారి వాహనాల నంబర్లను పరిశీలిస్తున్నారు. పెండింగ్‌ చలానాలు కట్టేయాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువగా పెండింగ్‌ చలానాలుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టు ద్వారా తిరిగి వాహనాలను తీసుకోవాలని, మరికొందరిపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. ఇక పోలీస్‌, ప్రెస్‌ స్టిక్కర్లను ద్వురినియోగం చేస్తున్న వారిని గుర్తించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ప్లానులు చేస్తున్నారు. పోలీసులు, పత్రికలు, ఛానెళ్ల కార్యాలయాలల్లో విధులు నిర్వహించే వారు ఏఏ ప్రాంతాల్లో సంచరిస్తుంటారో తెలుసుకుని అక్కడ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తుండడంతో రోజుకు 80 మంది నుంచి వంద మంది వరకూ పట్టుబడుతున్నారు. పోలీసుల బంధువుల్లో కొందరు తమ వాహనాలకు స్టిక్కర్లను అతికించడాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నారు.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎంతవరకైనా వెళ్తాం..

– ఎ.వి.రంగనాథ్‌, డీసీపీ, ట్రాఫిక్‌
కొందరు టు వీలర్ దొంగలు, కార్లలో వెళ్లేవారు సంబంధం లేకపోయినా పోలీస్‌, ప్రెస్‌, మీడియా స్టిక్కర్లను వినియోగిస్తున్నారని గుర్తించాం. ఇలా చేయడం తప్పు. నేరాల నుంచి తప్పించుకునేందుకు, తనిఖీల నుంచి మినహాయింపు కోసం కొందరు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే రహస్యంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. అనుమానం వచ్చిన వారిని ఆపి గుర్తింపు కార్డులు అడుగుతున్నాం తప్ప పరిచయం ఉన్న పోలీసులు, విలేకరులను నిలపడం లేదు. ప్రభుత్వం గుర్తించిన అక్రిడిటేషన్‌ కార్డులు చూపిస్తే వదిలేస్తున్నాం. ఇక మా పోలీసులు తొలగించిన స్టిక్కర్ల స్థానంలో మళ్లీ అతికించుకుని తిరుగుతూ చిక్కితే కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడం ఖాయం అన్నారు.