ప్రేమించిన యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య !

Tuesday, January 30th, 2018, 01:00:18 PM IST

ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకోమని బెదిరించి తనకు తానే కాల్చుకుని చనిపోయాడు ఒక యువకుడు. ఈ హృదయ విదారక ఘటన పాట్నాలో జరిగింది. ఉబ్ హస్ కుమార్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు, అయితే ఇటీవల అతనికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు తల్లితండ్రులు, దానితో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్ ప్రేమించిన యువతికి ఫోన్ చేసి దాదాపు రెండు గంటలసేపు మాట్లాడి గొడవపడ్డాడు. తర్వాత వీడియో కాల్ చేసి ఆమె వైపు చూస్తూ తుపాకీ తలకి గురిపెట్టాడు, తనని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తలకి తుపాకీ గురిపెట్టుకుని బెదిరిస్తూ మాట్లాడుతుండగా, భయపడిన యువతి ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దని వేడుకుంది. అయితే మాటల సందర్భంలో అతని వేలు పొరపాటున తుపాకీ ట్రిగ్గర్ పై పడడంతో పెద్ద శబ్దంతో బులెట్ తలలోకి దూసుకెళ్లి యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ శబ్దం విన్న ఇంట్లో వారు హుటాహుటిన పరుగెత్తుకు రాగా అప్పటికే కుమార్ రక్తపు మడుగులో పడివున్నాడు. అతడి తుపాకీ శబ్దం మాత్రమే విన్న ప్రియురాలు అతనికి దాదాపు 80 సార్లు తిరిగి కాల్ చేసింది. ఈ ఘటన పై పోలీస్ లు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు చూసిన పెళ్లి ఇష్టం లేకనే కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీస్ లు చెపుతున్నారు….