ఫోన్ ఎత్తలేదని క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య !

Thursday, February 8th, 2018, 09:00:06 AM IST

ఇటీవల కాలంలో ప్రతి చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అనే దిశగా మనిషి ఆలోచన సరళి మారింది. అయితే ఈ విధమైన మానసిక ప్రవృత్తికి లోనుకాకూడదని, మనల్ని మనం చంపుకోవడంకంటే, మనకు వచ్చిన సమస్యని ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండ దొరుకుతుందని మానసిక నిపుణులు చెపుతున్నారు. వారు ఎన్ని విధాలుగా చెపుతున్నా దేశం లో రోజూ ఏదో ఒక చోట ఈ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. కేవలం తన ప్రియురాలు తనతో ఫోన్‌లో మాట్లాడలేదన్న కారణంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా గొల్లమాలపల్లిలో గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన వింజేటి నవీన్‌ (21), గొల్లమాలపల్లికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.

వాస్తవానికి వారిరువురు బంధువులే కావడం, పైగా నవీన్ కు ఆ యువతి వరసకు అక్కకూతురు కావడంతో ఇరువర్గాల పెద్దలు కూడా వీళ్ల పెళ్లికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశంలో ఉంటోంది. ఇటీవలే ఆమె తన స్వగ్రామం గొల్లమాలపల్లిలో సొంత ఇల్లు నిర్మాణం చేపట్టింది. ఈ ఇంటి పనుల బాధ్యతలు కూడా నవీనే దగ్గరుండి చూసుకునేవాడు. అయితే వున్నట్లుండి వారిరువురి మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు వచ్చాయో తెలియదుగాని, ఆరోజు రాత్రి నవీన్‌ యువతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తని కారణంగా ఆగ్రహించిన నవీన్ ఆమె ఇంటికి వెళ్లి అసలు నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తలేదని ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. అసలు నేను చనిపోతేకాని నీకు బుద్దిరాదని అరచి బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యువతి బంధువులను పిలుచుకొచ్చేందుకు వెళ్లింది. అయితే ఆమె తిరిగి వచ్చేసరికి చున్నీతో ఉరివేసుకుని శవమై కనిపించాడని యువతీ చెపుతోంది. ఆమె తనను నిర్లక్ష్యం చేస్తుందన్న అనుమానంతో నవీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల సమాచారం నవీన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు….