ఏపీ ఎలక్షన్: వైఎస్ వీరాభిమానికి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందా..!

Thursday, May 16th, 2019, 09:29:01 AM IST

ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 23న ఫలితాలు వెలువడనుండడంతో గెలుపోటములపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి ఎన్నికలు పోటాపోటీగా సాగాయని అందరికి తెలిసిన సంగతే. ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే అనదరు అనుకున్నట్టుగా వైసీపీ విజయం సాధిస్తే జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అయితే ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయిపోయారంటూ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం, మంత్రివర్గ స్థానాల గురించి కూడా వైసీపీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే మే 23న వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయితే మాత్రం ఎవరెవరికి మంత్రివర్గ స్థానంలో చోటు కల్పిస్తారనేది మాత్రం అర్ధం కావడంలేదు. అయితే జగన్ క్యాబినెట్‌లో ఉండడానికి తమకు ఉన్న అర్హతలను గురించి అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ వర్గాలలో అనూహ్యంగా ఒకరి పేరు వినపడింది. ఆయనకు జగన్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారని అర్ధమవుతుంది. శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం సాధించిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు జగన్ మంత్రివర్గంలో స్థానం ఖాయమట. ఈయన రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు సొంత అన్న. వైఎస్ హయాంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సీట్లు తెచ్చుకుని గెలిచి చూపించారు. అంతేకాదు వైఎస్ అంటే ఈయనకు ఎంతో అభిమానం, గౌరవం. అందుకే ఆయన మరణానంతరం వెంటనే జగన్‌కి వేరే పార్టీ పెట్టమని సలహా ఇచ్చిన వారిలో ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ ఒకరు. కాంగ్రెస్‌లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి ఉప ఎన్నికలలో గెలిచి తన సత్తా చాటాడు.

అయితే 2014 ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యాడు. అయితే వైసీపీ పార్టీ స్థాపన నుంచి కూడా జగన్ వెంటే ఉంటూ పార్టీని అభివృద్ది చేసేందుకు అనుక్ష‌ణం కృషి చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అన్నీతానై న‌డిపించారు. ఇలా జగన్ దృష్టిలో కూడా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. అందుకే ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు జగన్ మంత్రి వర్గంలో పక్కాగా చోటు కలిపిస్తారని లోటస్ పాండ్ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈయనకు ప్రజల్లో మంచి పేరు ఉండడం, ఎలాంటి వివాదాలు లేకుండా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు. అంతేకాదు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కూడా కృష్ణ‌దాస్‌కు మద్ధతుగా ఉండడంతో జగన్ కూడా ఈయనను మంత్రిని చేయడానికి సముఖంగా ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు వైఎస్ పై ఉన్న అభిమానానికైనా జగన్ మంత్రి స్థానం కలిపిస్తారా లేదా అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి ఉండాల్సిందే.