తప్పు చేశాడు.. జగన్ పీకేశాడు.. తప్పేంటి !

Thursday, December 6th, 2018, 12:05:13 PM IST

ఎంత వ్యవస్థాపక సభ్యుడైనా పార్టీ అధ్యక్షుడికి మాటైనా చెప్పకుండా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం అనిపించుకోదు. కానీ వైకాపా బహిష్కృత నేత కొలిశెట్టి శివకుమార్ మాత్రం తనను బహిష్కరించి జగన్ తప్పు చేశాడన్నట్టు మాట్లాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ వైకాపా సెక్రెటరీ హోదాలో శివకుమార్ తెలంగాణ ఎన్నికల్లో వైకాపా అభిమానులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పత్రికా ప్రకటన విడుదలచేశారు.

అసలే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో కింగ్ అయిన జగన్ శివకుమార్ ఇలా తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రజల్లో పార్టీ ప్రతిష్టని తలకిందులు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని, పార్టీ పేరు మీద అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చేయడాన్ని అస్సలు సహించలేక ఉన్నపళంగా అతన్ని పార్టీ నుండి శాశ్వతంగా నిషేదించారు. నిజానికి జగన్ చేసిన పనిలో తప్పేమీ లేదు. అధ్యక్షుడి అనుమతి లేకుండా వేరొక రాష్ట్రంలో పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటూ ప్రకటన చేయడం ముమ్మాటికీ తప్పే. దానికి క్రమశిక్షణా రాహిత్యపు చర్యలు తీసుకోవడం సమంజసమే.

కానీ శివకుమార్ మాత్రం కేసీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినందుకే తాను కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తెరాసను ఓడించాలని చెప్పినట్టు సమర్థించుకుంటున్నారు. మరి ఆయన చేస్తున్న ఈ వాదన ఆయనకైనా న్యాయమైందని అనిపిస్తుందో లేదో ఆయనే తేల్చుకోవాలి.