జాగో జ‌గ‌న్.. లేకపోతే భారీ మూల్యం..!

Monday, February 11th, 2019, 10:00:49 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతుండ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌తో, అభ్య‌ర్ధుల ఎంపిక‌లో పూర్తిగా నిమ‌గ్న‌మైపోయాయి. ఇక ప్ర‌తిప‌క్ష వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల నుండి పాఠాలు ఎంత వ‌ర‌కు నేర్చుకుంద‌నేది ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో అనేక చోట్ల‌ రాజ‌కీయ‌స‌మీక‌ర‌ణాలకు వ్య‌తిరేకంగా, కొంద‌రికి టిక్కెట్లు ఇచ్చి మూల్యం చెల్లించుకున్న వైసీపీ ఈ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధుల విష‌యంలో ఎలాంటి వ్య‌హాలు అమ‌లు చేస్తుందనే ఇప్పుడు ఆశ‌క్తిక‌రంగా మారింది.

పార్టీలో పుట్టుకొస్తున్న ఓవ‌ర్ నైట్ నేత‌లతో వైసీపీ కొంపుమునిగే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజం పేట వ్య‌వ‌హారం చూసుకుంటే.. తాజాగా మేడా మ‌ల్లికార్జున రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవ‌డం, టిక్కెట్ కూడా ఆయ‌న‌కే వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో, అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఆకెపాటి అమ‌ర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాగే విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రాధాకు కూడా టిక్కెట్ విష‌యంలో అసంతృప్తి చెంది ఏకంగా పార్టీని వీడారు. మ‌రోవైపు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరి రావు కూడా టిక్కెట్ విష‌యంలోనే పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఇక తూర్పుగోదావ‌రి జిల్లాల్లో అయితే వైసీపీ శ్రేణులు గ‌గ్గోలు పెడుతున్నారు. పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుండి పార్టీకి సేవ‌లు చేసిన వారిని కాద‌ని, కొత్త‌వారికి టిక్కెట్ ఇవ్వ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంత‌మంది జ‌గ‌న్‌కు స‌న్నిహితులు అయిన‌వారు, వారి అనుకూల‌మైన‌వారికి టిక్కెట్లు ఇప్పించే విష‌యంలో ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో గెలుపు ఓట‌ములు స్థానికం, సామాజిక‌వ‌ర్గం ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా క్రింది స్థాయినేత‌ల‌ను క‌లుపుకుని వెళ్ళే వారు, ప్ర‌జాక్షేత్రంలో మంచి ప‌ట్టు ఉన్న‌వారికే గెలిచే అవ‌కాశ‌లు ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాల్లో మొహ‌మాటానికి పోయి జ‌గ‌న్ స్థానికేత‌రుల‌ను దించడంతో వారంతా ఓట‌మి చెందారు. అయితే ఇప్పుడు కూడా జ‌గ‌న్ అదే త‌ప్పు చేస్తే మ‌రోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. ఇక ఎన్నిక‌లు మ‌రో మూడు నెలల్లో జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో అభ్యర్ధుల విష‌యంలో జ‌గ‌న్ మేలుకోక‌పోతే 2014 రిజ‌ల్ట్ రిపీట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.