ఇక జగనే సీఎం !

Thursday, May 23rd, 2019, 01:55:46 PM IST

దేశరాజకీయ చరిత్రలోనే సుదీర్ఘమైన పాదయాత్రతో, దీక్ష‌లు ధ‌ర్నాలతో.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భంజ‌నం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ తొలిరౌండ్ లో వైయస్ఆర్ సీపీ 147 స్థానాలకు పైగా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. వైయస్సార్ మీద అభిమానంతో…ఆలాగే జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లిన విధానం.. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆకర్షణీయమైన పథకాలను రూపొందించడం, వీటితో పాటు అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని, పోలీసులకు వారంతపు సెలవు ప్రకటిస్తామని జగన్ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ కి అండగా నిలవడం వంటి అంశాలు జగన్ విజయంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.

 

ఏది ఏమైనా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. తొలి రౌండ్‌ కౌంటింగ్‌లో ఓ దశలో ఏకంగా చంద్రబాబుతో సహా నారా లోకేష్ మరియు మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా జగన్ ప్ర‌భంజ‌నం దెబ్బకి వెనుకంజలో పడ్డారు. అదేవిధంగా స్పీకర్ కోడెల ఇంకా టీడీపీలో చాలామంది బలమైన నాయకులు కూడా ప్రస్తుతం వెనుకంజలోనే ఉన్నారు. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలతో ఈ విషయం స్పష్టమైంది. మొత్తానికి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుల్లో అధిక స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులంతా భారీ ఆధిక్యాన్ని సాధించారు. ఇక జగన్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది.