`యువ బ‌ల‌గం` తో జ‌గ‌న్ న్యూ గేమ్ ప్లాన్‌?

Saturday, September 29th, 2018, 12:38:21 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏపీ అసెంబ్లీని వ‌దిలి గ‌త కొంత కాలంగా పాద‌యాత్ర పేరుతో రాష్ట్ర‌మంత‌టా ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో అత్యంత పిన్న వ‌య‌స్కుడైన ప్ర‌తిపక్ష నేత‌గా రికార్డు సృష్టించిన వైఎస్ జ‌గ‌న్ ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యువ మంత్రం జ‌పించాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. యువ నేత‌గా ప్ర‌స్తుత అనుభ‌వాల దృష్ట్యా వ‌చ్చే ఎన్నిక‌ల్లో యంగ్‌ టీమ్‌ని సెట్ చేసుకోవాల‌ని, ఆ క్ర‌మంలోనే ఎక్కువ‌ మంది యువ‌కుల‌కే టికెట్‌లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే అత్య‌ధికంగా యువ నేత‌ల్ని పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్ వారి గెలుపు, ఓట‌ముల విష‌యంలో స‌ర్వేకు సిద్ధ‌మైన‌ట్లు చెబుతున్నారు. జ‌గ‌న్ యువ నేత‌ల‌నే ఎక్కువ‌గా న‌మ్మ‌డానికి కార‌ణం త‌నూ యువ నేత కావ‌డమేన‌ని, అంతే కాకుండా యువ నేత‌లు అంత ఈజీగా పార్టీలు ఫిరాయించే అవ‌కాశం వుండ‌ద‌ని బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. ఆ కార‌ణంగానే పార్టీలో యువ నేత‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

పార్టీ ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మితుడైన ప్ర‌శాంత్ కిషోర్ కూడా య‌వ నేతే కావ‌డం, అత‌ను నిర్వ‌హించిన స‌ర్వేలో అత్య‌ధిక శాతం యువ నేత‌లు గెలుస్తార‌ని తేల‌డం కూడా జ‌గ‌న్ యువ మంత్రం జ‌పించ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. యువ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హిస్తూనే సీనియ‌ర్ల‌కూ పెద్ద‌పీట వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇలా స‌మ‌తూకం పాటిస్తే ఈ ఎన్నిక‌ల్లో గెలుపు అనివార్య‌మే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు.