పవన్ కళ్యాణ్ పేరు రాసిన జగన్..ఇరికించడానికేనా..?

Friday, February 24th, 2017, 03:50:35 AM IST


వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్ టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి 2014 ఎన్నికల సందర్భంగా టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టోని బయటకు తీశారు. ఇప్పటి వరకు జగన్ రైతు రుణమాఫీ, ప్రత్యేక హోదా వంటి అంశాలతో టిడిపిని ప్రశ్నించారు. కాగా యువతలో క్రేజ్ పొందాలంటే ఇవి సరిపోవని భావించిన జగన్ కొత్త రాగం అందుకున్నారు. టిడిపి మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా నిరుద్యోగ యువతకు రూ 2000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా యువతలో జగన్ కు పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తూ హెచ్చరిక జారీ చేసారు.

జగన్.. చంద్రబాబుకు రాసిన లేఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం విశేషం. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబుతో కలసి నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ లు కూడా పాల్గొన్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీలను వారు బలపరిచారని జగన్ లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు దానిని మరిచారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు ఇప్పటివరకు 1.15 లక్షల కోట్లు బకాయిలు పడ్డారని జగన్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో వాటికోసం నిధులు కేటాయించాలని జగన్ డిమాండ్ చేయడం విశేషం.అలా చేయక పోతే దీనిపై పోరాటం చేస్తానంటూ జగన్ హెచ్చరించారు. కాగా జగన్ బహిరంగంగా మోడీ, పవన్ కళ్యాణ్ లను ఇంతవరకూ విమర్శించలేదు.చంద్రబాబు కు రాసిన లేఖలో ఆయన ఇచ్చిన హామీలకు మోడీ, పవన్ లు కూడా భాద్యులని పేర్కొనడం విశేషం.