జగన్ రిమాండ్ ఈ నెల 21 వరకు పొడిగింపు

Friday, June 7th, 2013, 04:25:59 PM IST

వైఎస్ జగన్ రిమాండ్ ను కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. దాల్మియా సిమెంట్స్ ఛార్జ్ షీట్ లో ఏ1 నిందితునిగా ఉన్న జగన్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. విచారణ సాగించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 21 వరకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇటీవలే రాజీనామా చేసిన సబిత, ధర్మాన ప్రసాదరావులను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై విచారణను కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.

కుటుంబంతో మాట్లాడేందుకు జగన్ కు అనుమతి
కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు జగన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంటపాటు ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని సూచించింది. దీంతో జగన్ కోర్టు ఆవరణలో తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అంతకు ముందు వైఎస్ విజయమ్మ.. జగన్ ను చూసి కంటతడి పెట్టారు. కోర్టు హాలులో ఆయనను విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు.