2019 ఎన్నిక‌లు : ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది జ‌గ‌న్..!

Tuesday, January 29th, 2019, 05:35:40 PM IST

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతుండ‌డ‌బ‌తో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఒకవైపు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు వైసీపీ బ‌ల‌హీన‌త అయిన బూత్‌లెవ‌ల్ క్యాడ‌ర్ పై దృష్టి మ‌రల్చారు. ఎంత‌మంది లీడర్లు ప్రజల్లో తిరుగుతున్నా.. పార్టీ కార్యక్రమాలను ప్రజల చెంతకు చేరవేసేది, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను గుర్తించి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చేది బూత్ కమిటీ సభ్యులే. పాదయాత్రలో ఉన్న సమయంలోనే జగన్ బూత్ కమిటీలను పటిష్టం చేయాలని ఆదేశించారు.

అయితే ఇప్పుడు నేరుగా జగన్ వారితో సమావేశమై చర్చలు జరపడం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీ అన్ని రకాల ఎత్తులను వేస్తుందన్నది జగన్‌కు తెలియంది కాదు. దీన్ని గ్రామ స్థాయిలో అడ్డుకోగలిగేది బూత్ కమిటీలు మాత్రమే. అందుకోసమే నేరుగా తానే వారితో సమావేశమై వారిలో భరోసా నింపే ప్రయత్నానికి దిగారు జగన్. వాస్తవానికి బూత్ కమిటీలు పటిష్టంగా లేకుంటే ఎన్నికల ప్రచారమే కాదు, పోలింగ్ రోజు కూడా ఆ పార్టీకి కష్టాలు తప్పవనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టి అందుకు అనుగుణంగా ఏం చేయాలన్నది అధిష్టానం ఆదేశాల మేరకు ఆచరణలో పెట్టేది బూత్ కమిటీ సభ్యులే. ఇప్పటి వరకూ వైసీపీకి బూత్ కమిటీలు ఉన్నప్పటికీ అందులో సింహభాగం నైరాశ్యంలో ఉన్నట్లు జగన్ గుర్తించారు. నేతలు వారిని పట్టించుకోకపోవడంతో వారిలో నిస్పృహ ఆవ‌హించింద‌ని.. ఎన్నిక‌ల వేళ అది పార్టీకి చేటు చేస్తుంద‌ని గ్రహించిన జగన్ వెంటనే వారితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే నెల మొద‌టి వారంలో జ‌గ‌న్ నేరుగా వారికి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం మంచి ప‌రిణామ‌మే అయినా.. ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.