జ‌గ‌న్ స్వార్ధం వ‌ల్ల‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అంత న‌ష్టం జ‌రిగిందా..?

Tuesday, April 23rd, 2019, 08:04:46 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై తాజాగా ఏపీ ఆర్ధిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే కార‌ణ‌మ‌ని యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను న‌రేంద్ర‌మోదీ అడ్డుకున్నారని, కూలీలకు ఇచ్చే ఉపాధి నిధులు కూడా అడ్డుకున్నారని ఆరోపించారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంఓలో తిష్టవేసి అపోహలు పెంచారని య‌న‌మ‌ల అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఆర్బీఐని అడ్డుకుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో పన్ను రాబడులు పెరగలేదు కానీ, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం పెరిగిందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డిగా ఉన్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌ హయాంలో చేసిన అప్పులు కూడా తాము ఇప్పుడు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో 95,564 కోట్ల అప్పుల భారం పడిందని స్పష్టం చేశారు. 14 ఆర్థిక సంఘం లెక్కల్లో లోపాల వల్ల రాష్ట్రంపై 20 వేల కోట్ల నష్టం జరిగిందన్నరు. మ‌రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వ్యాఖ్య‌ల పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.