త‌ల‌పై ఐదుసార్లు న‌రికారు : వివేకానంద‌రెడ్డి మృతిపై వైఎస్ జ‌గ‌న్‌

Friday, March 15th, 2019, 07:39:48 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి మృత‌దేహానికి ఇవాళ పులివెందుల‌లో నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌గ‌న్ త‌న కుటుంబ స‌భ్యులతో స‌హా మీడియాతో మాట్లాడారు. త‌న చిన్నాన్న‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశార‌ని, ఆ త‌రువాత దాన్ని యాక్సిడెంట‌ల్ డెత్‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం నిందితులు చేశార‌న్నారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తామ‌ని చెప్పారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోని పోలీసు వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేద‌ని, క‌చ్చితంగా థార్డ్ పార్టీ ఆధ్వ‌ర్యంలోనే విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. త‌మ చిన్నాన్న‌ను ఒక ప్లాన్ ప్ర‌కార‌మే హ‌త్య చేసి దానిని యాక్సిడెంట‌ల్ డెత్‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని జ‌గ‌న్ అన్నారు. క‌చ్చితంగా ఈ హ‌త్యా ఉదంతంపై విచార‌ణ జ‌రిపి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

వివేకానంద‌రెడ్డి మృతి విష‌యంలో వైఎస్ అభిమానులంతా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య ఉదంతం అత్యంత దారుణ‌మైన, రాజ‌కీయంగా నీచ‌మైన చ‌ర్య‌గా జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. త‌న చిన్నాన్న హ‌త్య‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరును చూస్తుంటే త‌న‌కు బాధ క‌లుగుతుంద‌ని, 30 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌, సౌమ్యుడిగా ఉన్న వ్య‌క్తిని ఇంటికి వ‌చ్చి మ‌రీ అంత్యంత కిరాత‌కంగా హ‌త్య చేశార‌న్నారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి పులివెందుల‌లోని త‌న ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనే నిందితులు వ‌చ్చి.. బెడ్‌రూమ్‌లో ఉన్న వివేకానంద‌రెడ్డిపై దాడికి పాల్ప‌డ్డార‌న్నారు. త‌ల‌మీద‌నే ఐదుసార్లు న‌రికార‌ని, ర‌క్తం క‌క్కుకుని, బాత్‌రూమ్‌కు వెళ్లిన స‌మ‌యంలో మూర్చ వ‌చ్చి చ‌నిపోయాడ‌ని చెప్పేందుకు కుట్ర చేశార‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంద‌న్నారు.