మళ్లీ రిస్క్ లో జగన్.. ఈ సారి షర్మిల రూపంలో..?

Tuesday, September 26th, 2017, 02:51:56 PM IST


వైసిపి అధినేత జగన్ కు కడప జిల్లా కంచు కోట. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉన్నా కడపలో అంతా జగన్ కు అనుకూలంగానే ఉంటుంది. కడపలో జగన్ పార్టీకి ఎదురెళ్ళడం అంటే ప్రత్యర్థులకు సవాలే. కానీ జగన్ కంచు కోటకె చిల్లులు పడే రాజకీయం జరుగుతోందంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వలన వైసీపీకి జిల్లాలో ఇబ్బందికర వాతావరణం నెలకొందంటూ వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి ప్రత్యర్థుల ఎత్తుగడాలని తిప్పికొట్టడంలో తడబడుతున్నారని, ఆయన మెతక వైఖరి పార్టీ క్యాడర్ కు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగకుండా జగన్ తన సోదరి షర్మిలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

షర్మిలని కడప నుంచి ఎంపీగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనని జగన్ వైసీపీ కీలక నేతలతో చర్చిస్తున్నారట. దీనిపై అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. జగన్ గతంలో జైలు లో ఉన్న సమయంలో షర్మిల సమర్థ వంతంగా పార్టీ నడిపారు. ఆ సమయంలో రోడ్ షో లు బహిరంగ సభలతో షర్మిల దూసుకుపోయారు. నంద్యాలలో వైసీపీకి ఎదురైనా పరాభవాన్ని క్యాష్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కడపలో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పై ప్రజల దృష్టి మరలకుండా కొత్త ప్రజాకర్షక నాయకత్వం తీసుకురావాలని.. కడప నుంచి షర్మిల ని ఎంపీగా బరిలోకి దింపడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇలాంటి నిర్ణయం వలన గతంలో జగన్ ఆబాసుపాలయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన తల్లి విజయమ్మని విశాఖ ఎంపీగా బరిలోకి దింపారు. కానీ విజయమ్మ విజయం సాధించలేదు. ఆమెని విశాఖ బరిలో దింపాడమే జగన్ చేసిన పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు. ఆ ప్రభావం విశాఖ అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా పడింది. అలాగే సిట్టింగ్ ఎంపీని కాదని షర్మిలని కడప నుంచి బరిలోకి దింపితే జగన్ ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కుంటాడనేది కాలమే నిర్ణయించాలి.

  •  
  •  
  •  
  •  

Comments