వివేకా మృతిపై జ‌గ‌న్ ఎన్ఐఏ, సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదేనా..?

Friday, March 15th, 2019, 05:12:32 PM IST

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతి చాలా బాధ‌క‌ర‌మ‌ని ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ అన్నారు. కాగా, ఇవాళ వారు మీడియాతో మాట్లాడుతూ వివేకానంద‌రెడ్డి మృతిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నార‌ని, ఆ క్ర‌మంలోనే ప‌క్క పార్టీల‌పై బుర‌ద‌జ‌ల్ల‌డం ఏ మాత్రం స‌మంజ‌సం కాద‌ని, అటువంటి చ‌ర్య‌ల‌ను మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో క‌డ‌ప ఎంపీ సీటు కేటాయింపు విష‌యంలో అవినాశ్‌రెడ్డికి, వివేకానంద‌రెడ్డికి బేధాలు ఉన్నాయ‌ని, ఆ క్ర‌మంలోనే వైఎస్ జ‌గ‌న్ ఎన్ఐఏ, సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేసేందుకు వెన‌క్కు త‌గ్గుతున్నార‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వంపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ మీడియా స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ సీబీఐ విచార‌ణ‌, ఎన్ఐఏ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరే వైఎస్ జ‌గ‌న్.. నేడు త‌న చిన్నాన్న మృతి విష‌యంలో త‌లెత్తుతున్న అనుమానాల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఎందుకు డిమాండ్ చేయ‌డం లేద‌ని వారు ప్ర‌శ్నించారు.

వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం స‌హ‌జ మ‌ర‌ణంగా లేద‌ని, అనుమానాస్ప‌ద మృతిగా క‌నిపిస్తోంద‌న్నారు. వివేకా మృతిపై పూర్తి విచార‌ణ జ‌రిపి నిజాల‌ను వెలికి తీయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల‌పై ఉంద‌న్నారు. క‌నీసం జ‌గ‌న్‌కు న‌మ్మ‌క‌మైన తెలంగాణ పోలీసుల‌తోనైనా విచార‌ణ జ‌రిపించుకోవాల‌ని, అంతేకానీ వివేకా మ‌ర‌ణాన్ని కూడా వైసీపీ రాజ‌కీయాల‌కు వాడుకోవాల‌నుకోవ‌డం సిగ్గుచేట‌ని వారు విమ‌ర్శించారు.