మీడియా ముందుకు వివేకా కుమార్తె – అంత మాత్రానికే చంపుకుంటామా…?

Wednesday, March 20th, 2019, 11:34:26 AM IST

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్యలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు, ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ, వివేకాకు పులివెందుల, పులివెందుల ప్రజలు, అక్కడి తోటలు అంటే చాలా ఇష్టమని, హైదరాబాద్‌ కంటే పులివెందులలో గడిపేందుకే వివేకా ఇష్టపడేవారన్నారు. ప్రజలు ముందు కుటుంబం తర్వాత అనే సిద్ధాంతాన్ని నాన్న ఫాలో అయ్యేవారని సునీత అన్నారు.గత కొద్దికాలంగా తన తల్లికి కూడా అనారోగ్యంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఆమె తన వద్దే ఉంటోందని, దీంతో వివేకా ఒక్కరే ఒంటరిగా పులివెందులలో ఉంటున్నారని అన్నారు.

వివేకాకు పులివెందులలో సన్నిహితులు ఎక్కువని, ఆయన స్నేహితులు, అనుచరులు చాలా బాగా చూసుకునేవారని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు పక్కనే ఉండేవారని అన్నారు. తండ్రి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్య తర్వాతి రోజు నుంచి మీడియాలో వస్తున్న ఊహాగానాలు తనను మరింత బాధించాయని అన్నారు. చనిపోయిన వాళ్ల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం లేకుండా కొంత మంది వ్యక్తులు, మీడియా వ్యవహరిస్తున్నారని, గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానిస్తున్నారన్నారు. సిట్ బృందం విచారణ సరిగ్గా చేయట్లేదని, విషయం పక్కదారి పట్టిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ఆరోపించారు. తమది 700మంది సభ్యులున్న పెద్ద కుటుంబం అని, ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం అని, ఇలా ఏ కుటుంబంలో ఉండరని చెప్పుకొచ్చారు. మా అనుబంధాన్ని అర్థం చేసుకునే పరిణితి లేనివారే మా కుటుంబంలో విభేదాలున్నాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఏ కుటుంబంలో అయినా చిన్న మనస్పర్థలు సహజం అని, అంత మాత్రానికే మనుషులను చంపుకుంటామా? అని ప్రశ్నించారు. కొంత మంది పెద్ద మనుషులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దోషులు ఎంతటివారైనా శిక్ష పడాలని అన్నారు.