చంద్రన్న ఇంత పని ఎందుకు చేస్తివే..!

Saturday, April 21st, 2018, 01:00:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్షను ఎవరి కోసం చేశారని వైఎస్సార్‌ సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దీక్ష సారాంశం 12 గంటల పాటు ఉపవాసం ఉండటమేనని అన్నారు.

దేశంలోనే సీనియర్‌ నాయకుడిని తానేనని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్రంలో సాధారణ పరిపాలన చేయడం కూడా రావడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు దీక్షలో ప్రజల కంటే ఏసీలు, దిండ్లే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు.

అమరావతిని నిర్మించలేదు, పోలవరం ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కనీసం రైతులకు మద్దతు ధర కూడా లేదని అన్నారు. మద్దతు ధరల కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీలన్నీ టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

నీరు-చెట్టు కార్యక్రమంలో జరిగిన అవినీతిని కాగ్‌ ఎత్తి చూపిందని, ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. హౌసింగ్‌ స్కీమ్‌లో ఇల్లు కట్టించుకునేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేలు వసూల చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఒక్కటైనా ఫాలో చెబుతున్నారా? పాలకులను ప్రశ్నించారు.

థర్డ్‌ పార్టీ ద్వారా రాష్ట్రంలో టీడీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. మొత్తం పంచాయితీ రాజ్‌ వ్యవస్థను నారా లోకేష్‌ నాశనం చేశారని అన్నారు. టీడీపీ అవినీతిని చూసి జనం ‘చంద్రన్నా ఎంత పని చేస్తివి’ అని
అనుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే విచారణ జరుగుతుందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments