వేడెక్కుతున్న రోజాపై దాడి వ్యవహారం

Saturday, September 13th, 2014, 02:37:11 PM IST


చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై అమ్మవారి జాతరలో జరిగిన దాడి సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అంశంపై వైకాపా శ్రేణుల్లో దుమారం రేగుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికే నగరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నలలోనే వైకాపా నేతలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇక రోజాపై దాడిని తీవ్రంగా ఖండించిన పద్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు భేషరతుగా రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ రోజాపై దాడి టిడిపి అరాచకాలకు పరాకాష్టని, దీనిపై చంద్రబాబు ఏమి సమాధానమిస్తారని, ఇలాగ వ్యవహరిస్తే పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎందుకని తీవ్రంగా ప్రశ్నించారు. ఇక రోజాపై దాడిని వైకాపా నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు మద్దతుగా నగరిలో శనివారం ధర్నాకు దిగారు. టిడిపికి కొమ్ముకాస్తున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చెయ్యాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని వీరు డిమాండ్ చేశారు.