పవన్ కళ్యాణ్ ఆ సినిమా మానేది ఎప్పుడు..?

Tuesday, January 30th, 2018, 02:00:39 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడురోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వివిధ అంశాలు, సమస్యలపై ప్రజలతో జన సైనికులతో చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రజా యాత్రపై వైసిపి నేత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. జనసేన పార్టీ ప్రజా యాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకత్వంలో సాగుతొందని అన్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు దర్శకత్వంలోని సినిమాకు కూడా స్వస్తి చెప్పాలని ఎద్దేవా చేశారు.

జగన్ పాదయాత్ర 1000 కిమీ పూర్తైన నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి అనంతలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేశారు. ప్రజల వ్యతిరేకత కట్టబెట్టుకున్న చంద్రబాబుని, ఆయనకు మద్దత్తు తెలుపుతున్న పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారని, పాదయాత్ర 3 వేల కిమీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.