ఆమరణ దీక్ష విరమించే సమస్యే లేదు : వైసిపి నేతలు

Wednesday, April 11th, 2018, 03:53:43 PM IST

ఢిల్లీలో తెలుగు రాష్ట్ర నేతలు ప్రత్యేక హోదా కోసం చేస్తోన్న ప్రయత్నాల్లో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. రాజ్య సభలో అవిశ్వాస తీర్మానంపై కనీసం చర్చలు జరపలేదు. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో వైసిపి – టీడీపీ నేతల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరికి మంచి మరొకరు విమర్శలు చేసుకుంటూనే హోదా కోసం పోరాడుతున్నారు. ఎంత పోరాడినప్పటికీ ఢిల్లీలో పట్టించుకునే నాథుడే లేడు. మరో వైపు కావేరి నది జలాల సమస్య ఉదృతమవ్వడంతో ఎపి విషయం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వైసిపి నేతలు ఇటీవల నిరాహారదీక్షకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఎపి భవన్ ముందు వారు చేస్తోన్న నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని డాక్టర్లు ఇది వరకే చెప్పారు. దీంతో ఆమరణ దీక్ష చేస్తోన్న పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను బలవంతంగా ఆంబులెన్స్ లో ఎక్కించారు. దాదాపు 100 మంది పోలీసులు దీక్షను అడ్డుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. ముందుగా పోలీసులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడంతో బలవంతంగా తరలించాల్సి వచ్చింది. అయితే వైసిపి ఎంపీలు మాత్రం నిరాహార దీక్ష ఎంత మాత్రం ఆపేది లేదని కేద్రానికి సవాలు విసిరారు. అలాగే ఆస్పత్రిలో కూడా తమ దీక్ష కొనసాగిస్తామని చెప్పారు.