వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ అరెస్ట్..!

Monday, November 12th, 2018, 01:49:37 PM IST

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రతి అంశం లోను కీలక పాత్ర పోషిస్తుంది, రాజకీయాలను సైతం చాలా ప్రభావితం చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను వాడుకోవడంలో ముందంజలో ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారాలు ప్రజలను చాలా ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఆ ప్రచార శైలి శృతి మించితే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీస్తుంటారు. ఈ క్రమంలో టీడీపీ ఫిర్యాదు మేరకు, వైసీపీ సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు ను ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. తెలుగు దేశం పార్టీ పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగులే ఇందుకు కారణంగా తెలుస్తుంది.

పుంగనూరు కొత్తయిండ్లకు చెందిన శంకర్రాజు కుమారుడు నవీన్ కొంత కాలంగా వైసీపీ సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై, టీడీపీ పై అభ్యంతరకర పోస్టింగులు చేస్తున్నదన్న ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. ఓ ఇన్నోవా వాహనంలో వచ్చి పోలీసులు నవీన్ ను తీసుకెళ్లగా, నవీన్ కిడ్నాప్ కు గురయ్యాడని భావించి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కార్ నెంబర్ నోట్ చేసుకున్న కుటుంబ సభ్యులు విషయాన్నీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సోదరుడు ద్వారకా నాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చింతపర్తి వద్ద వైసీపీ నాయకులు వాహనాన్ని అడ్డుకోగా తాము గుంటూరు కు చెందిన పోలీసులమని, నవీన్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి తీసుకెల్తున్న విషయం చెప్పారు.