ఏపీ 2019 బిగ్ ఎలక్షన్: ఎన్నికలలో వైసీపీ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?

Monday, April 22nd, 2019, 11:20:03 AM IST

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11 న ముగిశాయి. అయితే ఫలితాలు మాత్రం మే 23 న ఉండడంతో ఒక్కొక్క పార్టీలు గెలుపు ఓటములపై తమ తమ ధీమాలను తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఒక పార్టీపై మరొకరు నిప్పులు పరంపరలు కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాత్రం ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని, ఎన్నికలలో వైసీపీ రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టిందని, ఒక్కో ఎమ్మెల్యేకి రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల చొప్పున ఖర్చు చేశారని, లోక్‌సభ స్థానాలకు, ఇతర ప్రచారానికి కలిసి మొత్తం రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను మద్యం, డబ్బులు చూపించి ప్రలోభాలకు గురిచేసిందని అయినా ఈసీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుద్ధావెంకన్న ఆరోపించారు.

ఇదిలా ఉండగా ఇంక ఎన్నికల ఫలితాలే వెలువడలేదు. అప్పుడే వైసీపీ నేతలు జగన్ ముఖ్యమంత్రి అంటూ ప్రచారాలు చేసి ప్రజలను, అధికారులను భయపెడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టం కట్టారని మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం జనసేన ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ వద్ద ఉందని, అందుకే ఆయనపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎన్నికల్లో మోదీ ఓడిపోతే విజయసాయిరెడ్డి జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ, బీజేపీకి తొత్తులా పనిచేస్తుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీద చెప్పు విసరడాన్ని బట్టి చూస్తేనే దేశంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, మోదీ పైన దేశ ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినాక వైసీపీ, బీజేపీలు ప్రతిపక్ష హోదాకి పరిమితమవ్వడం ఖాయమని ఆయన అన్నారు.