బెజవాడ పాలిటిక్స్..జగన్ సెల్ఫ్ గోల్..!

Thursday, January 18th, 2018, 12:41:01 AM IST

బెజవాడ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. స్థాయిక రాజకీయాల్లో వంగవీటి కుటుంబం పాత్ర ఎటువంటిదో అందరికి తెలిసిందే. కాగా ప్రస్తుతం వంగవీటి రాధా వైసిపి ని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయం అని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఇంత అర్జంటుగా రాధా పార్టీ మారాల్సిన పరిస్థితి ఏంటని స్థానిక నేతలంతా చర్చించుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ విషయంలో రాధా కు జగన్ మొండి చేయి చూపారని, ఆ స్థానాన్ని మల్లాది విష్ణుకు కేటాయించబోతున్నట్లు ప్రచరం జరుగుతోంది. రాధా అలకకు కారణం ఇదే.

కాపు సామజిక వర్గంలో బాగా పట్టున్న రాధా టీడీపీలో చేరితే జగన్ పార్టీకి నష్టం జరిగినట్లే. అందుకే స్వయంగా జగన్ రంగం లోకి దిగి రాధా ని బుజ్జగించడానికి ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించారట. కానీ విజయవాడ తూర్పు సెగ్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కానీ రాధా ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. రాధా వ్యవహారం ఇప్పుడు వైసిపి నేతలని కలవరానికి గురిచేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓటమికి కాపు సామజిక వర్గం ఓట్లు పడకపోవడం కూడా ఓ కారణం. ఇప్పుడు కీలకమైన కాపు నేతని జగన్ చేజార్చుకుంటుండడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. రాధాని కాదని మల్లాది విష్ణు కు పట్టం కట్టడంలో జగన్ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.