అందరికి దక్కని బాబు నిరుద్యోగ భృతి..!

Thursday, September 27th, 2018, 04:26:34 PM IST

తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్లో ముఖ్య వాగ్ధానం ఒకటి ఇంటికొక ఉద్యోగం.ఒకవేళ అలా ఉద్యోగం రాని పక్షంలో వారు నిరుద్యోగులకు ప్రతీ నెల వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని అందజేస్తాం అని ప్రకటించారు.ఇదిలా ఉంటె బాబు వస్తే జాబు రాలేదు సరి కదా,మొదటి నాలుగున్నర సంవత్సరాలు ఆ నిరుద్యోగ భృతిని కూడా అమలు చెయ్యలేదు.మళ్ళీ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఉద్యోగం లేని వారికి యువనేస్తం పేరిట భృతిని అందజేస్తాము అని ప్రకటించారు.

అప్పటికే దాదాపు 10లక్షల మంది జాబితా తయారయ్యిందని వారు నిరుద్యోగ భృతికి అర్హులని ప్రకటించారు.22 నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఇప్పటి వరకు కేవలం 10 లక్షల మందే ఉన్నారా?అని ప్రశ్నించేవాళ్ళు కూడా లేకపోలేరు.అంతే కాకుండా వయసు విషయంలో కూడా కాస్త సవరణ చేస్తే బాగుణ్ణు అని మరికొంత మంది నిరుద్యోగులు అనుకుంటున్నారు.లెక్క ప్రకారం చాలా మంది యువత వారి 20 నుంచి 21 సంవత్సరాల లోపే వారి డిగ్రీని పూర్తి చేసినవాళ్లు ఉన్నారు,వారిలో ఇప్పుడు నిరుద్యోగ భూతం చేత వెంటాడబడుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.సగటు విద్యార్థి తన 21 ఏళ్లకే తన డిగ్రీ పూర్తి చేసినపుడు,ఈ యువనేస్తం పథకానికి అర్హుడు కాలేకపోతున్నాడు.దీన్ని దృష్టిలో పెట్టుకొని వయసు విషయంలో సవరణ చేసి ఉంటె బాగుణ్ణు అని యువత తలలు పట్టుకుంటున్నారు.