జింబాబ్వే సంచలన విజయం..!

Sunday, September 15th, 2013, 11:17:55 AM IST

CRICKET

పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 64 పరుగుల ఆధిక్యం సంపాదించిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ ను 239 పరుగులకే ఆలౌట్ చేసింది.. 24 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది.. జింబాబ్వే బౌలర్ చటారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్ లో జింబాబ్వే 294 పరుగులకు ఆలౌటవగా.. పాకిస్థాన్ 230 పరుగులకే ప్యాకప్ అయింది. దీంతో జింబాబ్వేకు 64 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో జింబాబ్వే కేవలం 199 పరుగులకే ఆలౌటైంది.. జింబాబ్వే బ్యాట్స్ మెన్లలో మవోయో 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.. 264 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ 30 పరుగుల వద్ద ఓపెనర్ వికెట్ ను కోల్పోయింది.. ఆ తర్వాత కెప్టెన్ మిస్బావుల్ హక్ మినహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు.

చివరి రోజు ఆటలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ క్రీజులో పాతుకుపోయి పాక్ ను గెలిపించినంత పని చేశాడు…మరో ఎండ్ లో సపోర్ట్ లేకపోవడంతో ఓటమి చవిచూడక తప్పలేదు.. విజయానికి 24 పరుగుల దూరంలో చివరి వికెట్ రనౌట్ రూపంలో వెనుదిరగడంతో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది. మిస్బావుల్ హక్ 79 పరుగులతో నాటౌట్ గా నిలవగా….జింబాబ్వే బౌలర్లలో చటారా 5 వికెట్లు తీశాడు.. చటారా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా.. యూనిస్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు..