అమ్మ… నాన్న… ఆ తప్పుడు పని ఎలా చేస్తున్నారు? నడి రోడ్డులో పిల్లలు?

Wednesday, June 28th, 2017, 03:08:05 PM IST


భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో ప్రపంచ దేశాలు ఇప్పటికి చెబుతూ ఉంటాయి. ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక ఆడపిల్ల భర్తే సర్వస్వం అనుకోని ఉంటుంది. అలాగే ఒక్కసారి పెళ్ళయ్యాక మగాడు కూడా పరాయి స్త్రీ వ్యామోహంలో పడకుండా భార్యతోనే అన్ని అనుకుంటూ ఉంటాడు. ఈ సంసార జీవితంలో పిల్లలు పుడతారు. వారిని అల్లారు ముద్దుగా పెంచుతారు. వారి కోసం తమ జీవితాల్లో అన్ని సుఖాలని వదిలేస్తారు. ఇప్పటి వరకు భారతీయ వివాహ వ్యవస్థ గురించి, భార్యాభర్తల బంధం గురించి, తల్లిదండ్రుల ప్రేమ గురించి అందరు చెప్పే మాటలు, ప్రపంచానికి కూడా తెలిసే మాటలు. కాని పరిస్థితులు మారిపోయాయి. కాలం మారిపోయింది. అంతరాలు పెరిగిపోయాయి. మనిషి, మనిషి మధ్య దూరం పూడ్చలేని స్థాయిలో పెరిగిపోతుంది. ఈ అంతరంలో అమాయక పిల్లలు అనాధలుగా రోడ్డు మీదకి వస్తున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి పసితనంలోనే శిక్ష అనుభవిస్తున్నారు.

పెళ్ళైన భార్య భర్తలు వారి జీవితాల్లోకి పిల్లలని ఆహ్వానించి వారికి తల్లిదండ్రులు అవుతారు. అయితే అంత వరకు భాగానే వుంది. అక్కడి నుంచి తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వారి ఆలోచనలు దారి తప్పుతున్నాయి. సంపాదన కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. అంత వరకు ఒకే. కాని వాళ్ళు అక్కడితో ఆగిపోవడం లేదు. ఇంట్లో భార్య ఉన్న మగాడికి మరో స్త్రీ సాంగత్యం కావాలి. ఇంట్లో భర్త ఉన్న ఆడదానికి మరో మగాడితో అనుబంధం కావాలి. ఇలా వారి మధ్య ఆ అనుబంధాలు ఎంత వరకు వెళ్తున్నయంటే. ఒకరికి తెలియకుండా ఒకరు వేరొకరితో శారీరక సంబంధాలు పెట్టుకునేంత వరకు. ఏదో ఒక సందర్భంలో పెళ్ళాం మరో మగాడితో సంబంధం పెట్టుకున్న విషయం మొగుడుకి తెలిసిపోతుంది. మొగుడు మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్న విషయం పెళ్ళానికి తెలిసిపోతుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతరాలు పెరిగి, పిల్లల ముందే గొడవలు పడే స్థాయికి వస్తాయి. ఒక్కో సారి వారి మధ్య గొడవలు ప్రతీకార దాడుల వరకు వెళ్ళిపోతాయి. ఆ క్షణంలో భార్య మీద భర్త, లేదంటే భర్త మీద భార్య విచక్షణా రహితంగా దాడులు చేసుకోవడం జరుగుతుంది . అందులో ఒకరి ప్రాణాలు పోతాయి. మరొకరు జైలు గోడల మధ్యకి వెళ్లి యావజ్జీవ శిక్షలు అనుభవిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరి గొడవల వలన, వారి కడుపున పుట్టిన పాపానికి పిల్లలు రోడ్డు మీద పడతారు.

ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు తరుచుగా కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య ప్రియుడుతో కలిపి భర్తని చంపేయడం, లేదంటే వివాహేతర సంబంధం తెలిసిపోవడంతో భర్త, భార్యని అతి దారుణంగా చంపేయడం. ఈ కేసుల్లో చాలా వరకు హత్యల్లో భాగమైన జంటలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారే. అయితే అమ్మ చనిపోయింది అని, నాన్న జైలుకి వెళ్తున్నాడని మాత్రమె వారికి ఆ పిల్లలకు తెలియడం. అసలు ఎం జరుగుతున్నాయో అర్ధం కాక దిక్కులు చూడటం తప్ప మరేమీ చేయలేరు. తాజాగా శిరీష ఉదంతంలో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ మధ్య కర్ణాటకలో ఓ వివాహిత వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్త ప్రాణాలు తీసేసింది. విజయనగరంలో ఓ మహిళా వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నాడని భర్తని అతి దారుణంగా చంపేసింది. రాజమండ్రి సమీపంలో ఓ మహిళా వివాహేతర సంబంధంకి అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపేసింది. కృష్ణ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం తెలిసిన భర్త ఆమెని అతి కిరాతకంగా చంపేసాడు. ఇలాంటి ఘటనలు దేశంలో కాని, రాష్ట్రంలో కాని ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూ ఉన్నాయి. ఈ సంఘటన మాటున చివరికి అనాధలుగా మారేది పిల్లలే. ఈ విషయాన్ని పెళ్ళైన తర్వాత కూడా పరాయి మగాడు, ఆడవారితో శారీరక సుఖాలు కోరుకునే ప్రతి భార్య, ప్రతి భర్త ఆలోచిస్తే మంచింది.