వాట్సాప్ కు పోటీగా ఓ సూప‌ర్ చాటింగ్ యాప్..!

Tuesday, August 23rd, 2016, 02:13:34 PM IST


ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ల‌లో చాటింగ్ యాప్ అంటే వాట్సప్ మాత్రమే. గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నో యాప్స్ ఉన్నప్ప‌టికీ వాట్స‌ప్ కు ఉన్న క్రేజే వేరు. అందుకే ఎన్ని చాటింగ్ యాప్స్ వ‌చ్చినా వాట్స‌ప్ కు పోటీనివ్వ‌లేక‌పోయాయి. అయితే గూగుల్ తీసుకొస్తున్న ఓ సరికొత్త యాప్ మాత్రం వాట్స‌ప్ కు బ‌ల‌మైన పోటీనిస్తుంద‌ని టెక్ నిపుణులు చెపుతున్నారు. గూగుల్ రూపొందించిన ఆ యాప్ పేరే ‘అల్లో’.

సంప్ర‌దాయ చాటింగ్ యాప్ ల‌కు భిన్నంగా ఈ అల్లో యాప్ లో ఎన్నో ప్ర‌త్యేక‌తల‌ను పొందు ప‌రిచారు. ముఖ్యంగా ఈ యాప్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ తో ప‌నిచేస్తుంది. ఎదుటి వ్య‌క్తి నుంచి వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు అదే కొన్ని స‌మాధానాల‌ను ఇస్తుంది. అదే విధంగా మ‌నం ఒక ప‌దం టైప్ చేయ‌గానే దానికి సంబంధించిన ఇత‌ర విష‌యాల‌ను చూపించి మ‌న‌కు పూర్తిగా టైప్ చేయ‌కుండానే మేసెజ్ పంపే వీలుంది.

వాట్స‌ప్ మాదిరిగానే మొబైల్ నెంబ‌ర్ తో ఈ ‘అల్లో’ యాప్ లింక్ అయి ఉంటుంది. ఇక గూగుల్ ఖాతాతో లింక్ అయి ఉండ‌టం వ‌ల్ల యాజ‌ర్ చూస్తున్న వీడియోలు, వెతికే విష‌యాల ఆధారంగా అత‌ని ప్ర‌వ‌ర్త‌నను, అవ‌స‌రాల‌ను ఈ యాప్ అంచ‌నా వేస్తుంద‌ట‌. వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచ‌ర్స్ తో పాటు గూగుల్ మ్యాప్స్ ను కూడా ఇందులో పంపుకునే వీలుంది. ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్ ఈ యాప్ నోటిఫికేష‌న్ ను ఉంచారు. ముందుగా రిజిష్ట్రేష‌న్ చేయించుకున్న వారికి యాప్ రిలీజ్ కాగానే డౌన్ లోడ్ లింక్ తో మేసేజ్ వ‌స్తుంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.