ప్రీమియర్ షో టాక్ : ‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు !

Wednesday, January 10th, 2018, 11:08:07 AM IST

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న అజ్ఞాతవాసి చిత్రంపై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రం మంచి విజయం సాధించడంతో పవన్ అభిమానులు ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ మొదలుకుని ట్రైలర్ వరకు అభిమానులని తెగ అలరించాయి. దీనితో జనవరి 10 కోసం అంతా ఎదురుచూసారు. ఆ సమయం రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు అజ్ఞాతవాసి చిత్రం బ్రహ్మాండంగా విడుదల కాబోతోంది. కాగా యుఎస్ లో ఇప్పటికే ఫ్రీమియర్ షోలు పడ్డాయి. అజ్ఞాతవాసి పవన్ అభిమానులని అలరించే విధంగా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం..

పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ తోపాటు ఈ చిత్రానికి భారీ తారాగణం తోడైంది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, సీనియర్ హీరోయిన్ ఖుష్బు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ముందుగా ఊహించినట్లుగా ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ లో హై లైట్ అయిన అంశాలు. ఫన్నీ సీన్స్ లో సైతం పవన్ వన్ మాన్ షో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగడం, హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం ఫస్ట్ హాఫ్ లో మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కథ రివీల్ అయినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సాదాసీదాగా సాగాయి. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీన్స్ చిత్రాన్ని నిలబెడుతూ వచ్చాయి. ఓవరాల్ గా పవన్ ఫాన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించలేని యావరేజ్ చిత్రంగా అజ్ఞాతవాసి మిగిలిపోతుంది.